గతంలో మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్‌లో 'వజ్రాలదొంగ' అనే చిత్రం ప్రారంభమై ఆ తర్వాత ఆగిపోయింది. కట్ చేస్తే మరలా ఈసారి యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ 'వజ్రాల దొంగ'గా కనిపించడం ఖాయమైందని తెలుస్తోంది. 'బాహుబలి' చిత్రంతోనే నేషనల్ ఐకాన్‌గా మారిన ప్రభాస్ దాని తదుపరి చేస్తోన్న చిత్రం 'సాహో'. ఇందులో ప్రభాస్ పాత్ర మొదట రాబిన్‌హుడ్ పాత్రలా గొప్పవారిని దోచి పేదలకు పంచి పెట్టే కాన్సెప్ట్‌తో రూపొందుతోందని అందరూ భావించారు. దాదాపు 200కోట్ల భారీ బడ్జెట్‌తో టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్‌లతో సహా పలు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి 'రన్ రాజా రన్' ఫేమ్ సుజీత్ దర్శకుడు కాగా, ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్స్ వంటి యువిక్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు దీనిని నిర్మిస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం అందిస్తుండగా, శ్రద్దాకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. జాకీ ష్రాఫ్, చుంకీపాండేలతో పాటు పలువురు బాలీవుడ్, కోలీవుడ్ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఎంత పెద్ద చిత్రం అయినా సరే వీలైనంత త్వరగానే సినిమాలోని విశేషాలు ఎలాగోలా లీక్ అవుతుంటాయి. చివరకు 'బాహుబలి' చిత్రం విషయంలో కూడా కొన్ని ప్రత్యేకతలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
కానీ 'సాహో' చిత్రం విషయంలో ఏ చిన్న క్లూ కూడా బయటకు రాకుండా యూనిట్ గట్టి చర్యలే తీసుకుంటోంది. దీంతో ఎవరికి తోచిన రకంగా వారు కథ ఇలా ఉంటుంది? ప్రభాస్ పాత్ర ఇలా ఉండనుంది? అని ఊహిస్తున్నారు. ఇక సుజీత్ కూడా మిగిలిన ఆర్టిస్టులకు కూడా పూర్తి స్టోరీ అర్ధంకాకుండా షెడ్యూల్స్‌ని విభజించి, ఈ చిత్రంలో ఏ మాత్రం న్యూస్ బయటకు రానివ్వడం లేదు. బహుశా దుబాయ్ షెడ్యూల్ వల్లనే ప్రభాస్ ఇందులో 'వజ్రాల దొంగ'గా నటిస్తున్నాడని కొందరు భావిస్తూ ఉండటమే ఈ ప్రచారం జరగడానికి కారణమని చెప్పవచ్చు. ఇవ్వన్నీ కేవలం ఊహలే గానీ నిజంగా 'సాహో'లో ప్రభాస్ వజ్రాల దొంగేనా కాదా? అనేది వేచిచూడాల్సివుంది. ఇక ఇందులో శ్రద్దాకపూర్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుందని తెలుస్తోంది.