గత పదిహేను రోజులుగా టాలీవుడ్ లో పెళ్లిళ్లతో కళకళలాడుతుంది. ఏ డైరెక్టర్ కొడుకో, ఏ నిర్మాత కూతురి పెళ్ళో అనుకునేరు. కాదండి.. టాలీవుడ్ లో విడుదలైన పెళ్లిళ్ల సినిమాలు టాలీవుడ్ లో వారానికో పెళ్లి సినిమా అన్నట్టుగా విడుదలవుతుంది. ముందుగా మెగా డాటర్ నిహారిక హ్యాపీ వెడ్డింగ్ తో వచ్చింది. సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా నిహారిక మీద భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ హ్యాపీ వెడ్డింగ్ టాక్ తుస్ మనేసరికి సినిమా ప్లాప్ అయ్యి కూర్చుంది. కనీసం సినిమా విడుదలయ్యాక ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదంటే సినిమా ఎంతగా ప్లాప్ అయ్యిందో చిత్ర బృందానికి కూడా అర్ధం అయింది. ఇక హ్యాపీ వెడ్డింగ్ సినిమా సాక్ష్యం సినిమా హడావిడి లో కొట్టుకుపోయింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన సాక్ష్యం సినిమా హిట్ కాకపోయినా... హ్యాపీ వెడ్డింగ్ మీద పర్వాలేదనిపించింది. ఇక గత శుక్రవారం సుశాంత్ హీరోగా రుహని హీరోయిన్ గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చి.ల.సౌ సినిమా డీసెంట్ హిట్ అయ్యింది. సినిమా హిట్టే కానీ.. ఆపరేషన్ సక్సెస్ కానీ పేషేంట్ డెడ్ అన్నట్టుగా... చి.ల.సౌ సినిమా హిట్ అయ్యింది కానీ పాపం కలెక్షన్స్ రావడం లేదు.
సినిమాని ఎంతగా ప్రమోట్ చేసినా... చి.ల.సౌ సినిమా కి కలెక్షన్స్ రావడం లేదు. ఆన్లైన్ ప్రమోషన్స్ అంటూ రాహుల్ అండ్ బ్యాచ్ తెగ హడావిడి చేసినా అడివిశేష్ హీరోగా వచ్చిన గూఢచారి సినిమా హిట్ లో చి.ల.సౌ కొట్టుకుపోయింది. అదేగనక చి.ల.సౌ సోలోగా బరిలోకి వచ్చినట్లయితే... ఖచ్చితంగా చిన్న సినిమాగా వచ్చి చి.ల.సౌ హిట్ ఖాయమయ్యేది... కలెక్షన్స్ భారీగా కొల్లగొట్టేది. పాపం సుశాంత్ . ఇక తాజాగా నిన్న శుక్రవారం విడుదలైన నితిన్ - రాశి ఖన్నాల శ్రీనివాస కళ్యాణం సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. సినిమాలో సోది తప్ప మరేం లేదంటున్నారు. పెళ్లి కేసెట్ చూసిన ఫీలింగ్ కలిగింది అంటున్నారు. దిల్ రాజు బ్యానర్ లో మీడియం బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈ సినిమాలో పెళ్లి గురించి చెప్పిన కొన్ని పాయింట్స్ తప్ప.. భారీ తారాగణమే కానీ.. సినిమాలో కథలేదని... సతీష్ వేగేశ్న బోర్ కొట్టించేశాడని ప్రేక్షకులతో పాటుగా క్రిటిక్స్ కూడా శ్రీనివాస కల్యాణానానికి యావరేజ్ మార్కులే వేశారు. మరి ఈ సినిమా తో నితిన్ వరసగా మూడు సినిమాలను పోగొట్టుకున్నాడు. కాకపోతే... శ్రీనివాస కల్యాణానికి పోటీ అనుకున్న కమల్ హాసన్ విశ్వరూపం 2 సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో నితిన్ శ్రీనివాస కళ్యాణం కాస్త కష్టాల్లో గట్టెక్కే అవకాశం ఉంది. ఇకపోతే ఈ వారం కూడా అడివిశేష్ గూఢచారి సినిమా ఉన్న థియేటర్స్ మాత్రం హౌస్ ఫుల్ బోర్డులతో కళకళ లాడుతున్నాయంటే గూఢచారికి మరో ఐదారు రోజులు ఎదురు లేదనే చెప్పాయి. ఇక గీత గోవిందం విడుదల రోజు అనగా వచ్చే ఆగష్టు 15 వరకు గూఢచారి హవా కొనసాగించేలా వుంది. మరి ఈ టాలీవుడ్ లో వచ్చిన మూడు పెళ్లిళ్లలో.. హ్యాపీ వెడ్డింగ్ ప్లాప్ కాగా.. చి.ల.సౌ హిట్ అవగా...శ్రీనివాస కళ్యాణం మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక గీత గోవిందం ఏం చేస్తారో చూడాలి. ఇదండీ టాలీవుడ్ పెళ్లిల్లగోల.