బాలీవుడ్‌లో అమితాబ్‌బచ్చన్ నటించిన 'జంజీర్' చిత్రం పెద్ద బ్లాక్‌బస్టర్. దీనిని మరలా రామ్‌చరణ్ హీరోగా బాలీవుడ్‌లో 'జంజీర్' పేరుతో, తెలుగులో 'తుఫాన్' పేరుతో తీస్తే డిజాస్టర్ అయింది. అంతేకాదు.. పాత క్లాసిక్ చిత్రాల జోలికి వెళ్లవద్దని, ఏదో వాటిని తిరిగి రీమేక్ చేయాలనే తాపత్రయంతో వాటి విలువను తగ్గించవద్దని పలు విమర్శలు వచ్చాయి. ఇక రాంగోపాల్ వర్మ అమితాబ్‌తో మరోసారి 'ఆగ్' (షోలే) తీస్తే దాని పరిస్థితి అంతే దారుణంగా మిగిలింది. ఇక బాలీవుడ్ వెటరన్ స్టార్ ధర్మేంద్రకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌తో కలసి ఆయన 'షోలే, చుప్కే చుప్కే, చోటీసీ బాత్'తో పాటు పలు బ్లాక్‌బస్టర్స్‌లో కలసి నటించాడు. నాడు ధర్మేంద్రను అందరు హీమ్యాన్ అని ముద్దుగా, బిరుదుతో పిలిచేవారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ధర్మేంద్ర మాట్లాడుతూ, 'జంజీర్' చిత్రం గురించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలిపాడు. 'జంజీర్' చిత్రంలో హీరో పేరు విజయ్ ఖన్నా. ఈ చిత్ర కథను నన్ను హీరోగా ఊహించుకుని రాశారు. ఇందులో ముంతాజ్ నాతో కలిసి నటించాలి. కానీ నా బంధువు ఒకరితో 'జంజీర్' దర్శకుడు ప్రకాష్‌మెహ్రా గొడవ పడ్డాడు. దాంతో నాకు కోపం వచ్చి ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చాను. పంజాబ్‌లోని ఓ స్కూల్‌లో మా తండ్రి గారు ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. నేను బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని ఆయన కలలు కనేవారు. కానీ నాకేమో సినిమాలంటే ప్రాణం. దిలీప్‌కుమార్ నటించిన 'షహీద్' నేను చూసిన మొదటి సినిమా. ఆ చిత్రం చూసిన తర్వాత సినిమాలపై పిచ్చి నాకు మరింతగా ముదిరిపోయింది.. అని చెప్పుకొచ్చాడు.
కాగా దర్మేంద్ర, ఆయన ఇద్దరు కుమారులు సన్నిడియోల్, బాబీ డియోల్, హీరోయిన్ కృతికర్బంద కలసి నటించిన 'యమ్లా పగ్లా దివానా ఫిర్‌సే' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈనెల 31న విడుదల కానుంది. ఈ చిత్రానికి నవనీత్ సింగ్ దర్శకత్వం వహించాడు.