నేటిరోజుల్లో రాజకీయాలంటే జనాలకు బాగా సుపరిచితమైన పార్టీ చిహ్నాన్ని కూడా ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇందిరా కాంగ్రెస్ పార్టీ ఆవు, దూడ సింబల్ పెట్టుకున్నప్పుడు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతే అందరు ఆవుగా ఇందిరాగాంధీని, దూడగా సంజయ్‌గాంధీని పోలుస్తూ, ఆవుపోయే.. దూడా పోయే అంటూ సెటైర్లు విసిరారు. ఇక ఇటీవల ఎన్నికల కమిషన్ పార్టీల గుర్తు విషయంలో చాలా కఠిన నియమ నిబంధనలను విధిస్తోంది. కాంగ్రెస్ హస్తం, బిజెపి కమలంతో పాటు ఎన్టీఆర్‌కి నాడు సామాన్యుడు వాహనమైన సైకిల్ గుర్తు ఎంతగానో ఉచిత ప్రచారాన్ని తెచ్చిపెట్టింది. అదే వైయస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే వారికి ఇచ్చిన ఫ్యాన్ గుర్తు దేనికి చిహ్నమో ఆ పార్టీ వారికే తెలియని పరిస్థితి. ఇక ఇదే క్రమంలో టిఆర్‌ఎస్ గులాబీ, వామపక్షాల ఎన్నికల చిహ్నాలు కూడా భిన్నంగా, విప్లవాత్మకంగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఓ మంచి గుర్తుకు పవన్ తన రాజకీయ శ్రీకారం చుట్టి ప్రారంభించనున్నాడు. ఈయన తన పార్టీ చిహ్నంగా 'పిడికిలి' గుర్తును ఎంచుకున్నాడు.
పిడికిలి అనేది ఒకప్పుడు విప్లవ విద్యార్ధి సంఘాలకు సంకేతంగా ఉండేది. అదే గుర్తును పవన్ ఎంచుకోవడం వెనుక చాలా అంతరార్ధమే ఉంది. సమాజంలోని అందరి ఐక్యతకు చిహ్నంగా పిడికిలి గుర్తు ఉంటుందని, అన్నికులాలు, మతాలు ఐకమత్యంగా ఉండేలా కలిసి కట్టుగా ఉండి తమ సత్తాను చాటే గుర్తుగా పిడికిలిని ఎంచుకున్నామని పవన్ ప్రకటించాడు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా కష్టాలు, కన్నీళ్లే కనిపిస్తున్నాయి. ప్రజల బాధలు వింటుంటే కళ్లలో కన్నీళ్లు తిరుగుతున్నాయి. పలు గ్రామాలు, పట్టణాలు, పెద్ద నగరాలలో కూడా చెత్త చెదారం, మురికి వంటివి పేరుకుపోయి వ్యర్ధ పదార్ధాల మద్య సామాన్యులు జీవితం సాగిస్తున్నారు. ఇలా సామాన్యుని జీవితం దుర్భలంగా మారిపోతోంది. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. చెత్తకుప్పల పక్కనే ప్రజలు జీవనం సాగిస్తున్నారు. దోమల బెడద, ఈగలు ముసిరిన ఆహారం ప్రజలు తినాల్సిన దుస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు కల్పించినందుకు ప్రభుత్వాలు సిగ్గుపడాలి.. అంటూ ఆయన ఆవేదన వెలిబుచ్చాడు.