అక్షయ్‌కుమార్ నిజజీవితంలోనే కాదు.. సినీ నటునిగా కూడా రియల్ హీరో. ఇక ఈయన చేసే చిత్రాలలో కమర్షియల్ అంశాలతో పాటు సామాజిక బాధ్యత కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన ‘గోల్డ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన తొలి ఒలింపిక్ పోటీలలో స్వర్ణపతకం సాధించిన హాకీ జట్టు నేపధ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం స్వాతంత్య్రదినోత్సవ కానుకగా బుధవారం విడుదలైంది. ఈ చిత్రాన్ని తాజాగా ఇండియన్ మాజీ క్రికెటర్, ఢిల్లీ వాసి వీరేంద్రసెహ్వాగ్ స్పెషల్ స్క్రీనింగ్‌లో చూశాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ అక్షయ్‌కుమార్‌తో కలిసి తీయించుకున్న ఫొటోని పోస్ట్ చేశాడు.
మమ్మల్ని స్పెషల్ స్క్రీనింగ్‌కి ఆహ్వానించిన అక్షయ్‌కి కృతజ్ఞతలు. నేను ‘గోల్డ్’కి అమ్ముడుపోయాను. ఇందులోని నటీనటులంతా అద్భుతంగా నటించారు. సినిమా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా ఆడి మరెందరికో స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నాను.. అంటూ ట్వీట్ చేశాడు. సినిమా చాలా బాగుంది అని చెప్పడానికే సెహ్వాగ్ ఇలా ‘గోల్డ్’కి అమ్ముడుపోయాను అంటూ స్పందించడం ఆయన సమయస్ఫూర్తికి నిదర్శనంగా చెప్పాలి.
సెహ్వాగ్ ట్వీట్‌కి అక్షయ్ వెంటనే స్పందించాడు. సినిమాని చూసేందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ వీరూ పాజీ. మీకు సినిమా నచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన సమాధానం ఇచ్చాడు. ఈ చిత్రం స్పెషల్ స్క్రీనింగ్‌ని సచిన్ టెండూల్కర్, పివి సింధు, సెహ్వాగ్, బల్బీర్‌సింగ్ వంటి క్రీడాప్రముఖులు వీక్షించారు.