ఇటీవలే 32 ఏళ్ల సినీ కెరీర్‌ని విక్టరీ వెంకటేష్ పూర్తి చేసుకున్నాడు. ఇక మొదటి నుంచి ఒక చిత్రం వెంటనే మరో చిత్రం చేసే వెంకీ 'గురు' చిత్రం తర్వాత మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాడు. కిషోర్ తిరుమలతో 'ఆడాళ్లు మీకు జోహార్లు'తో పాటు పూరీ జగన్నాద్ నుంచి ఎందరితోనే కలిసి పనిచేయనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ వాటికి వెంకీ నో చెప్పాడని తెలుస్తోంది. ఇక ఈయన తెలుగులో 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు'తో మల్టీస్టారర్స్‌కి పునాది వేశాడు. అందుకు ముందే ఆయన 'త్రిమూర్తులు' చిత్రంలో యాక్షన్‌కింగ్ అర్జున్‌తో కూడా కలిసి నటించిన చిత్రం 'ఈనాడు'లో కమల్‌హాసన్‌తో నటించిన చిత్రం..ఇలా చాలానే ఉన్నాయి.
ఇక ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా రూపొందుతున్న 'ఎఫ్ 2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) చిత్రంలో మెగా యంగ్ హీరో వరుణ్‌తేజ్‌తో కలిసి యాక్ట్ చేస్తున్నాడు. మరోవైపు బాబి అలియాస్ రవీంద్ర దర్శకత్వంలో తన సొంత మేనల్లుడితో కలిసి మామా అల్లుళ్ల కాన్సెప్ట్‌తో 'వెంకీ మామా' అనే చిత్రానికి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఒకప్పటిలా ఏ పాత్రలంటే అవి చేయకుండా తనకు సరిపోయే పాత్రలలోనే ఆయన కనిపిస్తున్నాడు. 'మసాలా, గోపాల గోపాల' వంటి చిత్రాలు అలాంటి కోవకి చెందినవే.
ఇక తాజాగా వెంకీ మరో చిత్రానికి కూడా ఓకే చెప్పాడట. ఈ చిత్రం తమ సొంత ప్రొడక్షన్ సురేష్ బేనర్‌లోనే నిర్మితం కానుంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఈ చిత్రంతో తమిళ స్టార్ హీరో సూర్య కూడా తెలుగులో స్ట్రెయిట్ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే వెంకీ కూడా తమిళంలో నేరుగా చేస్తున్న చిత్రం ఇదే. ద్విభాషా చిత్రంలో రూపొందుతున్న ఇందులో వెంకటేష్, సూర్యలు ఇద్దరు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్స్‌గా నటించనున్నారని సమాచారం. గతంలో సూర్య తమిళంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చేసిన 'కాకా కాకా' చిత్రాన్ని తెలుగులో వెంకీ 'ఘర్షణ'గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? అనేది తెలియాల్సివుంది.