స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌గా బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో పలు పాత్రలను పలువురు ప్రముఖులు పోషిస్తున్నారు. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, బసవతారకంగా విద్యాబాలన్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్‌సింగ్, చంద్రబాబు నాయుడుగా రానా వంటి వారు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ మరో కూతురు పురందేశ్వరి భర్త, ఎన్టీఆర్ పెద్దల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రకి కూడా ఈ బయోపిక్‌లో స్థానం ఉంది. దాంతో ఈ పాత్ర కోసం ఎందరినో పరిశీలించి చివరకు తిరుపతిలో పుట్టి చెన్నైలో పెరిగిన నటుడు భరత్‌రెడ్డిని ఈ పాత్ర కోసం ఎంపిక చేశారట.
భరత్‌రెడ్డి ‘ఒక విచిత్రం, జల్సా, సిద్దం, ఈనాడు, కావ్యాస్ డైరీ, రగడ, బ్రోకర్, గగనం, బిజినెస్‌మేన్, రెబెల్, గ్రీకువీరుడు, అత్తారింటికి దారేది, కిస్, లౌక్యం, పైసా, జిల్, రాజా దిగ్రేట్, ఘాజీ’ వంటి పలు చిత్రాలలో నటించాడు. ఈయన తెలుగు ప్రేక్షకులకే కాదు.. తమిళ ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం. ఇక ఎన్టీఆర్ బయోపిక్‌లో నారా చంద్రబాబునాయుడు శ్రీమతి, ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరి పాత్రను మంజిమామోహన్ పోషిస్తోంది. ఇతర పాత్రల్లో రాశిఖన్నా, కీర్తిసురేష్, ప్రకాష్‌రాజ్ తదితరులు నటిస్తున్నారు.
ఇక ఈ చిత్రాన్ని బాలకృష్ణ, సాయికొర్రపాటి, విష్ణూ ఇందూరి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రను భరత్‌రెడ్డి పోషిస్తే, ఆయన శ్రీమతి, మాజీ కేంద్రమంత్రి, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి పాత్రను ఎవరు పోషించనున్నారో తెలియాల్సివుంది.