ఎవరిదైనా బయోపిక్ తీసేటప్పుడు ఆయా సంబంధిత వ్యక్తులు తమ జీవితాలలోని చెడును చెప్పకుండా అంతా పాజిటివ్ విషయాలనే చెబుతుంటారు. దాంతో ఆయా బయోపిక్‌లు కూడా కేవలం వన్‌సైడ్ యాంగిల్‌లో మాత్రమే ఉంటాయి. అయితే ఈ విషయంలో కొందరిని మాత్రం ఎంతో ప్రశంసించాలి. ఇటీవల ‘సంజు’గా సంజయ్‌దత్ బయోపిక్ రూపొందితే అందులో సంజయ్‌దత్ డ్రగ్స్‌కి అలవాటు పడటం, మహిళలతో, హీరోయిన్లతో ఆయనకున్న ఎఫైర్లు, జైలు జీవితం ఇలా తన జీవితంలోని మంచి చెడు రెంటిని చెప్పారు. దానిని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించడంతో అది ఓ కళాఖండంగా మిగిలింది. కానీ ఇంత ఓపెన్ మనషులు చాలా అరుదుగా ఉంటారు.
ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న ‘ఎన్టీఆర్’, వైఎస్‌ఆర్ ‘యాత్ర’, ఇటీవల విడుదలైన ‘మహానటి’ కూడా కేవలం వన్‌సైడ్‌గానే ఉన్నాయి.. ఉంటాయి. కోలీవుడ్‌లో కూడా జయలలిత, ఎంజీఆర్, కరుణానిధి వంటి వారి బయోపిక్స్ కూడా అలానే రూపొందుతున్నాయి. కానీ బాలీవుడ్‌లోని వారికి మాత్రం వివాదాలను కూడా చూపించగల గట్స్ ఉన్నాయి. ఇక విషయానికి వస్తే బాలీవుడ్‌లో మరో బయోపిక్ రూపొందనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ జీవితం ఆధారంగా బయోపిక్ రూపొందనుందని సమాచారం.
మధ్యతరగతి కుటుంబం నుంచి ప్రపంచ సుందరిగా, బాలీవుడ్ టాప్‌హీరోయిన్‌గా, అమితాబ్‌బచ్చన్ కోడలిగా.. ఐశ్వర్య జీవితంలో ఎన్నో కోణాలు ఉన్నాయి. వీటితో పాటు పలు వివాదాలు, హీరోలతో ఎఫైర్లు కూడా ఉండటం విశేషం. వీటన్నింటిని సినిమాటిక్‌గా చూపిస్తే ఈ చిత్రం భారీ విజయం సాధించడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్తలపై ఐష్ కూడా స్పందించింది. నా జీవితం తెరకెక్కాలని నేను కూడా కోరుకుంటున్నాను. నా జీవితంలోని అన్ని కోణాలు ప్రజలకు తెలియాలి. ఇందులో ఏదీ దాచాలని నేను అనుకోవడం లేదు. నా జీవితం సినిమాలకి అద్భుతమైన కథ అవుతుందని నేను కూడా భావిస్తున్నానని, నా జీవితంలోని చీకటి కోణాలను కూడా చెప్పడానికి సిద్దంగా ఉన్నానని ఐశ్వర్యారాయ్ బచ్చన్ తెలిపింది.