నారారోహిత్ కెరీర్‌లో తొలిసారిగా కాస్త మంచి అనుభవం ఉన్న దర్శకునితో చేస్తున్న చిత్రం 'ఆటగాళ్లు'. ఈ మూవీకి గతంలో జగపతిబాబుతో 'పెదబాబు', గోపీచంద్‌తో 'ఆంధ్రుడు', నితిన్‌తో 'రెచ్చిపో', ఏకంగా బాలకృష్ణతో 'అధినాయకుడు' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన పరుచూరి మురళి డైరెక్టర్. బాలకృష్ణతో 'అధినాయకుడు' వంటి అద్భుత అవకాశం వచ్చినా ఈయన సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. దాంతో ఆయనకు 'అధినాయకుడు' తర్వాత ఏకంగా ఆరేళ్ల గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం ఆయన నారా రోహిత్, జగపతిబాబులతో తీసిన 'ఆటగాళ్లు' చిత్రం ఈనెల 24న విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా దర్శన బానిక్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.
ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఆమె మాట్లాడుతూ, ఇంతవరకు బెంగాళీ చిత్రాలే చేస్తూ వచ్చిన నాకు 'ఆటగాళ్లు' చిత్రం మొదటి తెలుగు చిత్రం. నారారోహిత్, జగపతిబాబులు ఇద్దరు పోటీ పడి నటించారు. ఇందులో నేను హీరోని సిన్సియర్‌గా ప్రేమించే అంజలి అనే పాత్రను పోషిస్తున్నాను. నాపాత్ర ప్రేక్షకులందరికీ ఎంతో నచ్చుతుందన్న నమ్మకం నాకుంది. తెలుగులో 'ఆర్య, అరుంధతి, ధృవ, బాహుబలి' వంటి చిత్రాలు చూశాను. 'బాహుబలి' చూసినప్పటి నుంచి ప్రభాస్‌కి వీరాభిమానిని అయిపోయాను. ఆయన నటనంటే నాకు చాలా ఇష్టం. అలాగే బన్నీ స్టైల్ కూడా నచ్చుతుంది. ఈ ఇద్దరితో కలిసి నటించే చాన్స్ వస్తే మాత్రం అసలు వదులుకోను.. వీరితో నటించడం నా డ్రీమ్ అని చెప్పుకొచ్చింది. మరి 'ఆటగాళ్లు' పెద్ద హిట్ అయి, ఈమె స్టార్ హీరోయిన్‌గా మారితే గానీ ఈమె కోరుకుంటున్న ఇద్దరితో కలిసి నటించే అవకాశం రాదు. ఎందుకంటే వీరితో నటించడానికి నేడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా ఆమె కోరిక నెరవేరాలని కోరుకుందాం.