జన్మభూమి అంటే పుట్టిన దేశం, రాష్ట్రమే కాదు.. పుట్టిన ప్రాంతం, పెరిగిన ప్రాంతం కూడా. ఆయా ప్రాంతాల నుంచి ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగిన వారి వల్ల వారి ప్రాంతాలకే ఎక్కువ పేరు వస్తుంది. అలాగని పుట్టిన ఊరిని మర్చిపోకూడదు. 'శ్రీమంతుడు' చిత్రంలో చెప్పినట్లు మనకి జన్మనిచ్చిన ఊరికి ఏదో ఒకటి చేయకపోతే లావైపోతాం. అందుకు ప్రతి ఒక్కరు తమ జన్మభూమి కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక విషయానికి వస్తే దేశం గర్వించదగ్గ గానగంధర్వుడు ఎస్పీబాలసుబ్రహ్మణ్యం. ఈయన సొంత ఊరు నెల్లూరే అయినా ఈయన అమ్మ, అమ్మమ్మల సొంత ఊరు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట.
ఇక తాజాగా తన సొంత ఊరు కోనేటమ్మపేటలో పర్యటించిన బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, మా ఊరిలో ఆంధ్రులు (తెలుగువారు) తమిళవారు అందరు ఎంతో ఐకమత్యంగా ఉంటారు. జీవితంలో ఎక్కడ స్ధిరపడినా సొంత ఊరుని మర్చిపోకూడదు అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కోనేటం పేటలో రూ.12లక్షలతో తాగునీరు కోసం నీటి శుద్ది ప్లాంట్‌ని ఆయన ప్రారంభించారు. అలాగే స్కూల్ విద్యార్ధుల కోసం ఏర్పాటు చేసిన వాటర్ ట్యాప్‌లు, మరుగుదొడ్లను బాలు తన చేతుల మీదుగా ప్రారంభించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మా అమ్మమ్మ వారి ఊరు కోనేటమ్మపేట. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా సొంత గ్రామాన్ని మర్చిపోకూడదు. ఆత్మసంతృప్తి కోసమే నేను తాగునీటి శుద్ది ప్లాంట్‌కి రూ.12లక్షల విరాళం ఇచ్చాను. ఇది కీర్తి కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. అనంతరం గ్రామస్తులతో బాలు ముచ్చటించారు. సొంతూరి ప్రజల కోసం కొన్ని పాటలు పాడి అలరించారు.