మెగాస్టార్ చిరంజీవి చలన చిత్ర జీవితంలో ‘ఇంద్ర’కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రం గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, బాలకృష్ణ నటించిన ‘నరసింహనాయుడు’ వంటి చిత్రానికి కథ ఇచ్చిన చిన్నికృష్ణ ఇంద్ర కథను తయారు చేశారు. అయితే ఆ చిత్రం చేయడానికి అశ్వనీదత్, బి.గోపాల్‌లు ఒప్పుకోలేదు. అప్పటికే బాలకృష్ణతో ఆ తరహా రెండు ఫ్యాక్షన్ చిత్రాలు తీసి ఉన్నాం. ఆల్‌రెడీ చిరంజీవి గారితో ‘మెకానిక్ అల్లుడు’ తీసి దెబ్బతిన్నాను, నేను చేయను అని బి.గోపాల్ అన్నాడు. అశ్వనీదత్ కూడా ఆ చిత్రం నా వల్ల కాదన్నాడు. అప్పుడు గోదావరి నేపథ్యం నుంచి ఫ్లాష్‌బ్యాక్‌కి కాశీతీరానికి మార్చడంతో బి.గోపాల్ కాస్త మెత్తబడ్డాడు. అశ్వనీదత్ మాత్రం వీలుకాదన్నాడు. నేను చిరంజీవికి ఫోన్ చేసి విషయం చెప్పాను. చిన్నికృష్ణ చేత చిరంజీవికి కథ వినిపించాను. ఆయన వెంటనే కౌగిలించుకుని మనం ఈ చిత్రం చేస్తున్నామన్నారు.
ఇక మీరు మరీ రాసేట్లువంటి ఫ్యాక్షన్ డైలాగ్‌లని నా బాడీలాంగ్వేజ్‌కి తగ్గట్లుగా ఎక్కువగా రాయకండి. కొంచెం తక్కువ మోతాదులో ఉండేలా చూడండి అని చిరంజీవి గారు చెప్పారు. మేము కూడా అలాగే రాశాం. కానీ ఆడియో వేడుక రోజున ఫ్యాన్స్ అన్నా ఓ డైలాగ్.. అన్నా ఓ డైలాగ్ అంటూ ఓ డైలాగ్ చెప్పమని చిరుని ఉక్కిరిబిక్కిరి చేశారు. దాంతో చిరంజీవి గారు సామాన్యంగా అన్నాఓ స్టెప్పు అని అడుగుతారు. కానీ ఇప్పుడు అన్నా ఓ డైలాగ్ అంటున్నారు.అప్పటికే 80శాతం షూటింగ్ పూర్తయింది. మిగిలిన 20శాతానికి మీ ఇష్టం కొద్ది ఏ మోతాదులో అయినా సరే రాయండి.. మీ ఇష్టం అన్నారు.
అప్పుడు రాసిందే.. ‘మొక్కేకదా అని పీకేస్తే పీకకోస్తా’ అనే డైలాగ్ అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. ‘ఇక ఇంద్రలో ఒక బలమైన సీన్ పడాలని చిరంజీవి గారు అన్నారు.అప్పటికప్పుడు ఓ సీన్‌ని క్రియేట్ చేశాం. మేకప్ రూంలో కూర్చొని డైలాగ్స్ రాసి చిరంజీవి సెట్స్‌లో ఉంటే వినిపించాం. ఆ సీన్‌లోని డైలాగే ‘రాననుకున్నారా.. రాలేననుకున్నారా’. ఆ డైలాగ్ విని చిరంజీవి గారు అశ్వనీదత్ గారిని పిలిచి తన చేతిలోని ఓమొబైల్ చూపించి.. ‘ఇంత ఖరీదైన మొబైల్ గంటలో గోపాలకృష్ణగారి చేతిలో ఉండాలి. అది ఆయనకు మనం ఇస్తోన్న బహుబతి’ అన్నారు అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ.