ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడుగా శోభన్‌బాబు తర్వాత జగపతిబాబుకి అంత క్రేజ్ ఉంది. అదే సమయంలో ఆయన 'గాయం, సముద్రం, అంత:పురం' వంటి యాక్షన్ చిత్రాలతో కూడా మెప్పించారు. ఇక ఈయన హీరోగా బాగా డల్ అయిన తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి విజయపథంలో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో డజనుకు పైగా చిత్రాలు ఉన్నాయంటే ఆయన ఎంత బిజీగా ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు.
తాజాగా ఆయన మాట్లాడుతూ, 2012 తర్వాత సినిమా ఫీల్డ్‌లో కొనసాగడం ఇక కష్టమేనని భావించాను. అప్పటికే చేసిన అప్పులను తీర్చడానికి ఇంటిని సైతం అమ్మి వేసినా కూడా ఇంకా 3కోట్ల అప్పులు మిగిలే ఉన్నాయి. అలాంటి సమయంలో కుటుంబ పోషణ కోసం టివి సీరియల్స్‌లో అయినా నటించాలని భావించాను. ఇక ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో అద్భుతం జరగాలని కోరుకుంటారు. అలాంటి అద్భుతమే నా జీవితంలో జరిగింది. మొదటి నుంచి కూడా నేను టైమ్‌ని నమ్ముతాను. ఆ టైమ్ వచ్చింది. అదే నన్ను ఈరోజున ఈ స్థితిలో కూర్చొబెట్టింది. నేను డబ్బుకి విలువ ఇవ్వను. డబ్బులు ఉన్నది దాచుకోవడానికి మాత్రమే కాదు. కష్టాలలో ఉన్న వారికి సాయం చేయడం కోసం కూడా అని నేను నమ్ముతాను. ఎవరికైనా డబ్బులు ఇస్తున్నప్పుడు అది నాది కాదు అని భావిస్తాను.
కొందరు ఆపదలో ఉన్నప్పుడు సాయం అడిగినప్పుడు వారు తిరిగి ఇవ్వలేరని తెలిసి కూడా సాయం చేశాను. రావాలని ఉంటే వస్తుందని భావిస్తాను. అదే నిజమైంది కూడా. ఇతరులకు సాయం చేసే స్ధితిలో ఉండటాన్ని అదృష్టంగా భావిస్తాను. అందులో నాకెంతో సంతోషం లభిస్తుంది కూడా. ఒక్కోసారి నాకే అవసరమై ఇతరులను సాయం అడిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అప్పుడు నాకు ధనసాయం కాదు.. మాట సాయం చేసిన వారు కూడా లేరు. అయినా నేను అది పెద్దగా పట్టించుకోను. ఒకప్పుడు ఉన్నవాళ్లకి కూడా డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు మాత్రం లేని వారికే ఇస్తున్నాను అని తన మనసులోని భావాలను జగ్గూభాయ్ బయటికి చెప్పుకొచ్చాడు...!