బహుశా గోవిందుడు అనే పేరు చిరంజీవి, రామ్‌చరణ్‌ల కంటే విజయ్ దేవరకొండకే బాగా కలిసిసొచ్చిందని చెప్పాలి. ఆగష్టు15న విడుదలైన 'గీతగోవిందం' చిత్రం మొదటి ఐదు రోజుల్లోనే 50కోట్లు కొల్లగొట్టి, రెండు వారాలలోనే 100కోట్ల క్లబ్‌లో చేరాడు. పరశురాం దర్శకత్వంలో అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం అల్లుఅరవింద్‌కి ఏకంగా 50కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టిందని సమాచారం. కేవలం 10కోట్లతో రూపొందిన ఈ చిత్రం ఇటీవలి కాలంలో ఏ నిర్మాతకు, ఏ చిత్రం సాధించిపెట్టని లాభాలను సంపాదించిపెట్టింది.
గతంలో అల్లుఅరవింద్‌కి కూడా బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్ హీరోగా రూపొందిన 'గజిని' తర్వాత ఆ స్థాయి లాభాలను తెచ్చిపెట్టిన చిత్రం ఇదేనని అంటున్నారు. 'గజిని' చిత్రం 100కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించిన చిత్రంగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో టాప్‌స్టార్స్ సరసన స్థానం సంపాదించుకునేందుకు విజయ్ ఉరకలు వేస్తున్నాడు. ఇప్పటికే ఈయన చేతిలో 'ట్యాక్సీవాలా'తో పాటు మూడు చిత్రాలు ఉన్నాయి. 'పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, గీతగోవిందం'తో విజయ్‌కి ఇప్పుడు 10కోట్లు ఇవ్వడానికి కూడా నిర్మాతలు రెడీగా ఉన్నారు. ఈ మూడు చిత్రాల తర్వాత తమ బేనర్‌లో నటించమంటే...తమ బేనర్‌లో నటించమని విజయ్‌కి సన్నిహితుల ద్వారా కూడా రికమండేషన్స్ వెళ్తున్నాయట. మొత్తానికి తెలుగు తెరపైకి మరోస్టార్ దూసుకువచ్చాడు. ఇప్పటి వరకు యంగ్ స్టార్స్‌లో నానికి మాత్రమే 5కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుతోంది. మరి విజయ్ నేడున్న జోరు చూస్తుంటే నానికి కూడా పోటీ ఇవ్వడం ఖాయమనేనని అంటున్నారు.
మరోవైపు గీతాఆర్ట్స్2లోనే విజయ్ నటించిన 'ట్యాక్సీవాలా' చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సివుంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం దర్శకుడు రాహుల్ స్పందించాడు. ఈ చిత్రం తాను అనుకున్నట్లుగానే వచ్చిందని, ఒక్క సీన్‌ని కూడా రీషూట్ చేయడం లేదని, కేవలం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్‌లోనే జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపాడు. ఈ చిత్రం విజయ్‌కి మరో భారీ విజయం అందించడం ఖాయమని రాహల్ చెప్పుకొచ్చాడు.