డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. అకాల మరణంపై మెగాస్టార్ చిరంజీవి తన సంతాపాన్ని తెలియజేస్తూ ''మిత్రురాలు, సోదరి సమానురాలు బి.జయగారు మన మధ్య లేరు అనేది జీర్ణించుకోలేనిది. ఈ విషయం తెలిసి అవాక్కయ్యాను. నమ్మశక్యం కాలేదు. బి.ఎ.రాజు నాకు చిరకాల మిత్రుడు. చెన్నయ్‌లో ఉన్నప్పటి నుంచి జయగారితో, బి.ఎ.రాజుతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జయగారు రైటర్‌గానే కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహిత్యంలోని అన్ని ఫీల్డులలో ఆమె నిష్ణాతురాలని చెప్పగలం. రచయిత్రిగా, పత్రిక ఎడిటర్‌గా, దర్శకురాలిగా.. ఇలా అన్ని శాఖల మీద మంచి పట్టున్న గొప్ప సాంకేతిక నిపుణురాలు. అలాంటి బి.జయ లేకపోవడం పరిశ్రమకు తీరని లోటు. ముఖ్యంగా మహిళా దర్శకురాలిగా ఎంతో పేరు గడించిన తను లేకపోవడం పరిశ్రమకు పెద్ద లోటు.
ముఖ్యంగా మా బి.ఎ.రాజుకి చాలా తీరని లోటు. బి.ఎ.రాజుతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు.. 'చనిపోయింది తను కాదు, నేను.. నా ఆలోచనల్లో, ఊహల్లో జయ బ్రతికే ఉంది. తను లేకపోతే నేను లేను' అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. సోదరి జయ ఎక్కడ ఉన్నా సరే ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ.. బి.ఎ.రాజు, వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్నివ్వాలని భగవంతుడ్ని కోరుకుంటూ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను'' అన్నారు.