విభిన్న చిత్రాలు, పాత్రలు పోషిస్తాడనే పేరు కోలీవుడ్‌లో స్టార్ సూర్యకి బాగా ఉంది. అయితే ఈయన శైలి కమల్‌హాసన్, విక్రమ్‌ల తరహాలో మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్‌గా ఉంటుంది. అదే రజనీకాంత్, విజయ్, అజిత్‌లది వేరే దారి. వారికి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. రోటీన్ చిత్రాలు చేసినా కాస్త కనెక్ట్ అయితే చాలు కోట్ల వర్షం కురుస్తుంది. ఇలా చూసుకుంటే సూర్యది క్లాస్‌టచ్ అయితే విజయ్‌ది మాస్‌టచ్. వీరిద్దరు వచ్చే దీపావళికి ఒకేసారి పోరులో పోటీ పడనున్నారు అని వార్తలు వచ్చాయి.
సూర్య ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'ఎన్జీకే' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ రాజమహేంద్రవరంతో పాటు పలు లొకేషన్లలో వేగంగా జరుగుతోంది. ఇక 'మెర్సల్' వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత విజయ్ 'తుపాకి, కత్తి' చిత్రాల తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో 'సర్కార్' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. ఈ రెండు చిత్రాలను దీపావళికి విడుదల చేస్తామని ఇప్పటికే ప్రటించారు. సూర్య, విజయ్‌ల పోలిక ఎలా ఉంటుంది అంటే కమల్‌హాసన్, రజనీకాంత్‌లకి ఉన్నంత తేడా వీరిమధ్య ఉంది. ఈ పోటీ నిజంగా జరిగి ఉంటే ఫామ్‌లో లేని సూర్యకే భారీ నష్టం అని చెప్పవచ్చు.
అయితే తాజాగా సూర్య ఈ పోటీ నుంచి తప్పుకున్నాడట. ఎన్జీకే చిత్రం భారీ చిత్రం కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతాయనే ఉద్దేశ్యంతో సూర్య చిత్రం వాయిదా పడిందని అంటున్నా.. కేవలం విజయ్‌తో పోటీ వద్దనుకుని, సోలోగా రావడం కోసమే సూర్య ఈ నిర్ణయం తీసుకున్నాడని కోలీవుడ్ మీడియా కోడైకూస్తోంది.