నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'బిగ్‌బాస్ 2' మీద సంచలన నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది. నూతన్‌నాయుడు ఎలిమినేషన్ తర్వాత దానిపై ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించింది. నూతన్‌నాయుడు ఎలిమినేషన్‌తో ప్రేక్షకుల ఓట్లకు విలువ లేకుండా పోయిందన్న విషయం స్పష్టమైందని ఆమె పేర్కొంది. అమిత్ కంటే నూతన్‌నాయుడుకి ప్రేక్షుల నుంచి ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా నూతన్‌ని ఎలిమినేట్ చేయడం దారుణమని వ్యాఖ్యానించింది. కేవలం రీఎంట్రీ కారణంగానే నూతన్‌నాయుడుని బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి పంపారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంఘటనతో ఇక ప్రేక్షకుల ఓట్లకు ఎలాంటి విలువ లేదన్న విషయం స్పష్టమైందని, కేవలం షోని షోగా చూసి ఆనందించడం తప్ప దీని గురించి ఆలోచించడం వృధా అని తెలిపింది.
కాగా తాజాగా బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. సామాన్యుని కోటాలో వచ్చిన గణేష్ శనివారం ఎలిమినేట్ కాగా, ఆదివారం నూతన్‌నాయుడు ఎలిమినేట్ అయ్యాడు. సామాన్యుడి కోటాలో బిగ్‌బాస్2లోకి అడుగుపెట్టిన నూతన్‌నాయుడు ఒకసారి ఎలిమినేట్ అయి, మరలా రీఎంట్రీ ఇచ్చాడు. గణేష్ సెలబ్రిటీలకు ధీటుగా 84రోజులు హౌస్‌లో తన సత్తా చూపి ఇప్పుడు ఎలిమినేట్ అయ్యాడు.
దీంతో ప్రస్తుతం బిగ్‌బాస్‌లో కేవలం సెలబ్రిటీలు మాత్రమే ఉన్నారు. నిజానికి ఈ విషయంలో మాధవీలత వెలిబుచ్చిన అభిప్రాయాన్నే ప్రేక్షకులు కూడా వ్యక్తపరుస్తున్నారు. ఫైనల్ వరకు సామాన్యుడిని ఉంచితే షోకి పెద్దగా రెస్పాన్స్ రాదనే ఉద్దేశ్యంతోనే హౌస్‌లో సెలబ్రిటీలను మాత్రమే ఉంచి, ఫైనల్ విజేతను కూడా సెలబ్రిటీనే చేయాలనే ఉద్దేశ్యం బిగ్‌బాస్2లో కనిపిస్తోందన్నవిమర్శలు చెలరేగుతున్నాయి.