సోషల్‌మీడియా బాగా విస్తృతం అవ్వడం వల్ల ఎన్ని లాభాలు జరుగుతూ ఉన్నాయో అదే మరో కోణంలో చూస్తే మాత్రం అంతకు మించిన చెడు జరుగుతోందని స్పష్టంగా అర్ధమవుతోంది. సాంకేతికత అనేది రెండంచుల కత్తి వంటిదని ఇప్పటికైనా అందరికీ అర్ధమయ్యే ఉంటుంది. అయితే అది మన వరకు రానంత కాలం దాని దుష్ప్రభావం గురించి మనం పెద్దగా పట్టించుకోం. అదే మన దాకా పరిస్థితి వస్తే దాని విశృంఖలత్వం అర్ధం అవుతుంది. జీవితంలో బతికి ఉండగా, మరణించారనే ప్రచారం జరిగితే సెంటిమెంట్ పరంగా, ఇతరత్రా ఆయా వ్యక్తులు, వారి కుటుంబాలు,వారి సన్నిహితులు ఎంతగా బాధపడతారో అది అనుభవించిన వారికే తెలుస్తుంది. ఇది కేవలం కొందరు తెలిసి తెలియక చేసే ఆకతాయిల వల్ల జరుగుతోందని భావిస్తున్నారు. కానీ ఎంతో బాధ్యతాయుతమైన మీడియా కూడా ఇలాంటి తొందరపాటు వార్తలను ప్రచారం చేసుకుని తమ మీద ఉండే గౌరవాన్ని, నమ్మకాన్ని పోగొట్టుకుంటోంది.
ఇక విషయానికి వస్తే గత కొంతకాలంగా బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే తీవ్రమైన క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విదేశాలలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ తన భర్త, పిల్లలతో ఉన్న ఆమె చనిపోయిందనే వార్తలు సోషల్‌మీడియాలో వ్యాప్తి చెందాయి. ఏకంగా మహారాష్ట్రకి చెందిన బిజెపి ఎమ్మెల్యే అయిన బాధ్యతాయుతమైన వ్యక్తి అయిన రామ్‌కదమ్ కూడా ఈ వార్తలు నిజమా? కాదా? అనేది నిర్దారించుకోకుండా తామే ముందుగా సంతాపం తెలిపిన ఘనతను పొందాలని భావించి తొందరపడ్డాడు. అదే ప్రస్తుతం ఆయన పరువును నిలువునా తీస్తోంది. సోనాలిబింద్రే మరణించిందనే వార్తను ఆయన ట్వీట్ చేస్తూ ఏకంగా ఆమెకి, ఆమె కుటుంబానికి శ్రద్దాంజలి ఘటించేశాడు. వెంటనే తప్పు తెలుసుకున్న ఆయన తనకు వచ్చిన వార్త నిజం కాదని తెలుపుతూ, సోనాలి త్వరగా కోలుకోవాలంటూ ఆ భగవంతుడిని ప్రార్దిస్తున్నట్లు తెలిపాడు. దీనిపై పలు విమర్శలు చెలరేగాయి.
స్వయంగా సోనాలి భర్త గోల్డీబెహల్ స్పందించాడు. ఈ విషయమై ఆయన ఓ ట్వీట్ చేశాడు. ‘నా భార్య సోనాలి గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరుకుంటున్నాను. మీడియాను బాధ్యతతో వినియోగించండి. ఇలాంటి పుకార్ల వల్ల ఎందరి మనోభావాలో దెబ్బతింటాయి’ అంటూ సుత్తిమెత్తగా చీవాట్లు పెట్టాడు. మనిషికొక మాట.. గొడ్డకొక దెబ్బ అనేది అందుకే సుమా...!