చైనీయులు చారిత్రక నేపధ్యం ఉన్న చిత్రాలను బాగా ఆదరిస్తారు. అందులో వివిధ దేశాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను చూపిస్తారు కనుక అలాంటి వాటిపై వారు ఆసక్తి చూపుతారు. కానీ అదే ఏదో సాంకేతిక హంగులతో వచ్చిన చిత్రాలను, కల్పితగాధలను మాత్రం నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తారు. దానికి మన దేశంలో సంచలన విజయం సాధించిన 'బాహుబలి' చిత్రం అక్కడ పెద్దగా ఆదరణ పొందకపోవడం ఓ ఉదాహరణ. అదే సమయంలో అమీర్‌ఖాన్ 'దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్' వంటి చిత్రాలు మాత్రం కనివినీ ఎరుగని రీతిలో విజయవంతం అయ్యాయి.
కానీ 'బాహుబలి' రిలీజ్ ఖర్చులను సాధించడంలో కూడా నానా తిప్పలు పడింది. ఈ విషయంలో చైనా కంటే జపాన్ ప్రేక్షకులు కాస్త బెటర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే 'బాహుబలి' చిత్రం అక్కడ 100రోజులు ఆడింది. ఆ విజయం ఇచ్చిన స్ఫూర్తితో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మగధీర' చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేశారు. ఈ చిత్రం అక్కడ 10రోజుల్లోనే 17కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ఇక 'బాహుబలి' చిత్రం విషయంలో అందరి కంటే జపాన్ ప్రేక్షకులను సుబ్బరాజు బాగా ఆకట్టుకున్నాడు.
ఇటీవల 'బాహుబలి' విడుదల సందర్భంగా సుబ్బరాజుతో దిగిన ఫొటోలను విపరీతంగా వైరల్ చేసిన జపాన్ ప్రేక్షకులు ఇప్పుడు మగధీర ఫొటోలను కూడా బాగా వైరల్ చేస్తున్నారు. జపాన్ ప్రేక్షకులు 'మగధీర' చిత్రాన్ని తీసిన రాజమౌళి, నటించిన రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి రాజమౌళికి చైనాలో దక్కని విజయం జపాన్‌లో దక్కడం మాత్రం సంతోషం కలిగించే విషయమనే చెప్పాలి. రాజమౌళి తను తీసిన చిత్రాల ద్వారా ఇతర దేశాలలో కూడా తెలుగు వారి సత్తా చాటుతూ ఉండటం ఆనందించదగ్గ విషయంగా చెప్పుకోవాలి.