దిగ్రేట్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ లైకా ప్రొడక్షన్స్ బేనర్‌లో ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్‌గా తెరకెక్కిస్తోన్న అత్యంత భారీ ప్రతిష్టాత్మక చిత్రం '2.ఓ'. 'బాహుబలి' రికార్డులను కొల్లగొట్టే అవకాశం ఈ చిత్రం ఒక్కదానికే ఉందని ఎప్పటినుంచో అందరు భావిస్తున్నారు. ఓ దక్షిణాది తెలుగు చిత్రాన్ని బీట్ చేసే స్థాయి మరో దక్షిణాది కోలీవుడ్ చిత్రానికే సాధ్యమని, ఈ ఫీట్ బాలీవుడ్‌కి కూడా అసాధ్యమనే టాక్ రావడమే నిజంగా సంతోషించాల్సిన విషయం. ఇక మన దేశంలో త్రీడీ ప్రొజెక్టర్స్ ఉన్న థియేటర్లు, అత్యంత వినూత్నమైన సాంకేతికంగా ఉత్తమమైన థియేటర్లు మనకి తక్కువే అని చెప్పాలి.
అందుకే పలు హాలీవుడ్ చిత్రాలు 3డీలలో రూపొందుతూ ప్రేక్షకులకు విభిన్న అనుభూతిని కల్పిస్తూ ఉంటే మనం మాత్రం మూస ధోరణిలోనే పోతున్నాం. అలాంటి మనదేశంలో '2.ఓ' చిత్రం పూర్తిగా 3డి కెమెరాలతో రూపొందుతోంది. ఇప్పటికే పలు థియేటర్ల యాజమాన్యాలు తమ ప్రొజెక్టర్లు, సౌండ్ సిస్టమ్ వంటి వాటిని '2.ఓ' కాగా భారీ మొత్తంలో డబ్బు వెచ్చిస్తూ అధునాతనంగా తయారు చేస్తున్నాయి. ఇక నవంబర్ 29న విడుదల కానున్న ఈ చిత్రం టీజర్‌ని వినాయక చవితి రోజు విడుదల చేయనున్నాడు. 3డీ టీజర్ కావడంతో దీనిని వీక్షించే అభిమానులు అసౌకర్యంగా ఫీల్ కాకూడదనే ఉద్దేశ్యంతో '2.ఓ' నిర్మాతలు, దర్శకుడు శంకర్‌లు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. 3డీ టీజర్ చూసే వారు దగ్గరలోని పివిఆర్, సత్యం థియేటర్లలో చూడవచ్చని వారు తెలిపారు.
ఇందుకోసం 9099949466కి మిస్డ్‌కాల్ ఇచ్చి ఉచిత టిక్కెట్‌ను బుక్ చేసుకోవాలని యూనిట్ సూచించింది. అలా ఉచితంగా టిక్కెట్ బుక్ చేసుకున్న వారు వినాయకచవితి రోజే ఉచిత టీజర్‌ని చూడవచ్చు. దేశవిదేశాలలోని 3వేల మంది గ్రేట్ టెక్నీషియన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. అంతేకాదు 75 మిలియన్ డాలర్లు అంటే 543కోట్ల భారీ బడ్జెట్‌తో విఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్స్‌ని పూర్తిస్థాయిలో వినియోగిస్తూ తీసిన తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. మరి శంకర్ చేసిన మ్యాజిక్ ఏమిటో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.