టాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్స్‌లో కమిట్‌మెంట్, డెడికేషన్, సినిమా, కళ అనేవి కాసుల కోసం కాదు.. ప్రజల కోసం అని నమ్మిన దర్శకుల్లో ది గ్రేట్ టి.కృష్ణ ఒకరు. అతి చిన్న వయసులోనే ఆయన క్యాన్సర్ బారిన పడి మరణించాడు. ఆయన చిన్నకుమారుడే తొట్టేంపూడి గోపీచంద్. తన తండ్రి మరణం నాటికి ఈయనకు కేవలం 8ఏళ్లే. ఇక ఈయన పై చదువులు చదువుతున్న సందర్భంలో 'అమ్మాయికాపురం' అనే చిత్రం షూటింగ్‌లో ఈయన సోదరుడు ప్రేమ్‌చంద్ కూడా కారు ప్రమాదంలో మరణించాడు. ప్రకాశం జిల్లాకు చెందిన గోపీచంద్ హీరోగా మారి చేసిన మొదటి చిత్రం 'తొలి వలపు'. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. దాంతో ఆయన పెద్ద సాహసమే చేశాడు. 'జయం, నిజం, వర్షం' వంటి పలు చిత్రాలలో విలన్‌గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రని 'యజ్ఞం' సినిమాలో చేసి హీరోగా తనని తాను నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఆయనకు వరుసగా హిట్స్ వచ్చాయి.
సామాన్యంగా అంత తొందరగా రాని మాస్‌ఇమేజ్ గోపీచంద్ కి రెండో చిత్రంతోనే వచ్చింది. కానీ గత కొంతకాలంగా ఆయన సినిమాలు నిరాశపరుస్తూ ఉన్నాయి. ఇటీవలే తన 25వ చిత్రంగా చేసిన 'పంతం' కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక విషయానికి వస్తే ఈయన హీరో శ్రీకాంత్ మేనకోడలైన రేష్మని 2013లో వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ఇప్పటికే విరాట్‌కృష్ణ (3) అనే కుమారుడు ఉన్నాడు. తాజాగా వినాయకచవితి పర్వదినం వేళ గోపీచంద్ మరో బిడ్డకు తండ్రి అయ్యాడు. దాంతో ఆయన ఇంట్లో సంబరాలు రెట్టింపు అయ్యాయి. గోపీచంద్ భార్య రేష్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తెల్లవారు జామున 5గంటల 40 నిమిషాలకు బాబు పుట్టాడని సమాచారం. మరి కొత్త కుమారుడి రాకతో గోపీచంద్ కెరీర్ కూడా ఒకప్పటిలా ఊపందుకోవాలని ఆశిద్దాం...!