ఒక్కప్పుడు తెలుగు సినిమాని బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ వారు కొనాలంటే ఎన్నో సమస్యలు..ఎన్నో కండిషన్స్ ఉండేవి. కానీ కొన్నేళ్ల నుండి అలా లేదు. తెలుగు మార్కెట్ పెరగటం..మన తెలుగు స్టార్స్ ఇమేజ్ కూడా పెరగటంతో బాలీవుడ్ నిర్మాణ సంస్థ వాళ్లు మన సినిమాలని కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్.. ఈరోస్ సంస్థలు ఒక సమయంలో తెలుగు సినిమాలపై బాగా ఆసక్తి చూపించాయి. చాలా మంచి రేటుకే సినిమాను కొనేవాళ్లు.
వారి సంస్థలు రిలీజ్ చేసిన సినిమాలన్నీ వరుసగా బోల్తా కొట్టేశాయి. పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ మినహాయిస్తే రిలయన్స్ వాళ్లు రిలీజ్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద తుస్ మన్నాయి. ఇక ఈరోస్ సంస్థ పరిస్థితి కూడా అంతే. మహేష్ బాబువి రెండు సినిమాలు కొనగా రెండు డిజాస్టర్స్ అయ్యాయి .‘1 నేనొక్కడినే’.. ‘ఆగడు’ సినిమాలను మంచి రేట్స్ కి కొని బాగా దెబ్బ తిన్నారు. దాంతో వాళ్లు అప్పటినుండి తెలుగు సినిమాలు కొనడం మానేశారు. మళ్లీ రీసెంట్ గా ‘సాక్ష్యం’ సినిమాను నమ్ముకుని రీఎంట్రీ ఇచ్చారు. అది కూడా డిజాస్టర్ అయ్యి కూర్చుంది.
అయినా కానీ బాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఏం మాత్రం తగ్గకుండా తెలుగులో ఇంకో సినిమా కొనడానికి రెడీ అయ్యారు. నాగార్జున - నాని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మల్టీ స్టారర్ ‘దేవదాస్’ చిత్రంని ప్రముఖ బాలీవుడ్ సంస్థ వయాకామ్ 18 కొనుగోలు చేసింది. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని అందించిన ఈ సంస్థ ఫ్యాన్సీ రేటు ఇచ్చి ‘దేవదాస్’ వరల్డ్ వైడ్ రిలీజ్ రైట్స్ తీసుకుందట. కొన్ని రోజులు కిందట రిలీజ్ అయిన టీజర్‌లో ‘వయాకామ్ 18’ లోగో కూడా కనిపించింది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఉంది. మరి వారు ఏ నమ్మకంతో ఈసినిమాను కొన్నారో వారికే తెలియాలి. ఎన్నో అంచనాలు మధ్య ఈ నెల 27న ‘దేవదాస్’ విడుదల అవ్వబోతుంది.