మహానటి సావిత్రి బయోపిక్‌గా ‘మహానటి’ రూపొంది ఘనవిజయం సాధించింది. బయోపిక్‌లు అరుదుగా వచ్చే టాలీవుడ్‌లో బయోపిక్‌ల కంటూ ఓ బెంచ్‌మార్క్‌ని ‘మహానటి’ ఏర్పాటు చేసింది. మీడియం బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ ప్రేరణతో ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నిర్మాతగా, హీరోగా తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మరోవైపు స్వర్గీయ మహానేత వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రను మూలాంశంగా తీసుకుని ఇండియన్ గ్రేట్ యాక్టర్ మమ్ముట్టి.. వైఎస్‌ఆర్‌గా నటిస్తున్న ‘యాత్ర’ చిత్రం రూపొందుతోంది.
‘ఆనందోబ్రహ్మ’ దర్శకుడు మహి.వి.రాఘవ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ‘యాత్ర’ చిత్రాన్ని డిసెంబర్‌లో జగన్ బర్త్‌డే కానుకగా విడుదల చేయనున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌గా ‘చంద్రోదయం’, కత్తికాంతారావు బయోపిక్‌లతో పాటు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి కారకుడు, తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై కూడా ఓ బయోపిక్ రూపొందనున్నట్లు, ఇందులో కేసీఆర్ పాత్రను నవాజుద్దీన్ సిద్దిఖీ పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్దిఖీ ఇండో-పాక్ రచయిత సాదత్ హసన్ మంటో జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ‘మంటో’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా నవాజుద్దీన్ సిద్దిఖీ హైదరాబాద్ వచ్చాడు. కేసీఆర్ బయోపిక్‌కి సంబంధించి తననెవ్వరూ సంప్రదించలేదని ఆయన తెలిపాడు. ‘ఈ చిత్రానికి సంబంధించి నన్నెవ్వరూ సంప్రదించలేదు. కేసీఆర్ వంటి గొప్పనాయకుని బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే మాత్రం వదులుకోను. దానిని అదృష్టంగా భావిస్తాను..’ అని చెప్పుకొచ్చాడు.