తమిళంలో నగేష్, గౌండ్రమణి, సెంథిల్‌ల తర్వాత వడివేలు హవా మొదలైంది. ముఖ్యంగా శంకర్ తీసిన ‘ప్రేమికుడు’ చిత్రం ఆయనకు ఎంతో గుర్తింపును తీసుకుని వచ్చింది. అయితే పెద్ద పెద్ద స్టార్స్ చిత్రాలలో నటిస్తూ తన హవా కొనసాగించిన వడివేలు పేద కుటుంబం నుంచి వచ్చినా కూడా గర్వంతో విర్రవీగేవాడు. ఈయనను కెరీర్ మొదట్లో బాగా ప్రోత్సహించింది స్టార్ విజయ్‌కాంత్. కానీ అదే విజయ్‌కాంత్‌ని బూతులు తిట్టి, నా ఇమేజ్‌తో పోల్చుకుంటే నీవెంత? నీ చిత్రాలన్నీ నా వల్లే ఆడాయి అనడమే కాదు.. రాజకీయాలలో కూడా విజయ్‌కాంత్‌కి వ్యతిరేకంగా కుట్రపన్ని, ఆయన ఓటమికి ప్రచారం చేశాడు. ఎవరో దీని వల్ల బాధపడి ఆయన ఇంటిపై దాడి చేస్తే విజయ్‌కాంతే నా ఇంటిపై దాడి చేసి తనని చంపాలని ప్రయత్నించాడని కేసును పెట్టాడు.
ఇక రజనీ సైతం తాను నటించే చిత్రాల ముందుగానే నిర్మాత, దర్శకులకు ముందుగా వడివేలు కాల్షీట్స్ తీసుకుని, తర్వాత నావి తీసుకోండి అని మర్యాదగా చెప్పేవాడు. కానీ వడివేలు అహంకారం ఎక్కడి దాకా వెళ్లిందంటే రజనీ సైతం నా ముందు బచ్చా అనే స్థితికి వెళ్లాడు. దీంతో రజనీ అభిమానులు కూడా ఆయనపై భగ్గుమన్నారు. ఇక రజనీతో పాటు పలువురు వడివేలుని పక్కనపెట్టి వివేక్, సంతానం వంటి వారిని ప్రోత్సహించడం మొదలు పెట్టారు. ఈయన ‘చంద్రముఖి’ చిత్రంలో నటించాడు. ఇక అవకాశాలు లేక గోళ్లు గిల్లుకుంటున్న వడివేలుని దర్శకుడు శంకరే నిర్మాతగా మారి తన శిష్యుడు శింబుదేవన్ దర్శకత్వంలో ‘హింసించే రాజు పులకేశి’ చిత్రం తీశాడు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. దాంతో తాను స్టార్ హీరోనని, ఇకపై హీరో పాత్రలే చేస్తానని అన్నాడు. కానీ కాలం కలిసి రాలేదు. ఈ చిత్రం తర్వాత ఆయన హీరోగా చేసిన చిత్రాలన్నీ డిజాస్టర్స్‌గా నిలిచాయి. దీంతో మరలా శంకరే తన చిత్రానికి సీక్వెల్ నిర్మించేందుకు రెడీ అయ్యాడు. వడివేలు కాల్షీట్స్ కూడా తీసుకున్నాడు. ఈ చిత్రం కోసం భారీ సెట్లు వేసి విపరీతంగా ఖర్చుపెట్టాడు. కొన్నిరోజులు సవ్యంగానే జరిగిన షూటింగ్ ఉన్నట్లుండి ఆగిపోయింది. ఆ ఆగడం మరలా ఈ చిత్రం షూటింగ్ మరోసారి ప్రారంభం కాలేదు. దీనికి వడివేలు కాల్షీట్స్ కేటాయించకపోవడమే కారణమని శంకర్ నిర్మాతల మండలిలో కేసు వేశాడు. మండలి వడివేలుకి నోటీసులు ఇచ్చి వివరణ కోరింది.
దానికి సమాధానంగా వడవేలు తన కాల్షీట్స్‌ని ఈ చిత్రబృందం వృధా చేశారని తెలిపాడు. ఈ చిత్రం కారణంగా తాను ఎన్నో చిత్రాలు వదులుకోవాల్సివచ్చిందని సమాధానం ఇచ్చాడు. మరలా కాల్షీట్స్ కావాలంటే మరోసారి పారితోషికం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. శంకర్ మాత్రం ఈ చిత్రాన్ని వడివేలు చేయకపోతే తనకు 9కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నిర్మాతల మండలిని ఆశ్రయించాడు. దీనినే నిర్మాతల మండలి దృడపరచడంతో వడివేలు షాక్‌కి గురయ్యాడు. దీంతో ఆయన ఈ చిత్రంలో నటించడం తప్ప వేరే మార్గం లేదని అందరు భావించారు. వడివేలు మాత్రం తాను ఆ చిత్రంలో నటించడం లేదని ఖరాఖండీగా చెప్పాడు. దీంతో నిర్మాతల మండలి ‘పులకేసి సీక్వెల్’ పూర్తి చేసే వరకు ఆయన మరో చిత్రంలో నటించడం వీలుకాదని బహిష్కరించింది. ఈ విషయమై వడివేలుని సంప్రదించగా తనకు నిర్మాతల మండలి నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపాడు. ప్రస్తుతానికి వడివేలు ఏ చిత్రంలో కూడా నటించడం లేదు.