అమెరికాలో పుట్టి పెరిగిన మలయాళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్. ఈమె డల్లాస్, టెక్సాస్ వంటి ప్రాంతాలలో బాల్యాన్ని గడిపింది. బాలనటిగా మలయాళంలో వచ్చిన 'స్వప్నసంచారి' చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఆమె 'యాక్షన్ హీరో బిజు' అనే మూవీతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. కాగా ఈమె మొదటగా ఒప్పుకున్న తెలుగు చిత్రం గోపీచంద్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఎ.యం.రత్నం నిర్మించిన 'ఆక్సిజన్'. కానీ ఈ సినిమా విడుదలలో బాగా జాప్యం జరగడం వల్ల ఆమె నాని సరసన నటించిన 'మజ్ను' చిత్రం మొదటి సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించింది. అనంతరం రాజ్‌తరుణ్ హీరోగా వచ్చిన 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత 'ఆక్సిజన్' చిత్రం విడుదలైంది. మధ్యలో విశాల్ హీరోగా నటించిన తమిళ చిత్రం 'తుప్పరివాలన్'తో కోలీవుడ్‌కి పరిచయం అయింది. తమిళంలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో 'డిటెక్టివ్'గా వచ్చింది.
అదే సమయంలో ఆమెకి అనుకోకుండానే అద్భుతమైన రెండు ఆఫర్లు తలుపుతట్టాయి. పవన్‌కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'ఆజ్ఞాతవాసి' చిత్రంలో కీర్తిసురేష్ మెయిన్ హీరోయిన్‌గా నటించగా, అను ఇమ్మాన్యుయేల్ సెకండ్ హీరోయిన్ పాత్రను పోషించింది. ఆ వెంటనే అల్లుఅర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకునిగా పరిచయం అవుతూ తీసిన 'నాపేరు సూర్య... నా ఇల్లు ఇండియా'లో మెయిన్ లీడ్ హీరోయిన్ పాత్రను పోషించింది. కానీ దురదృష్ట వశాత్తు ఈ రెండు చిత్రాలు సరిగా ఆడకపోవడంతో ఈమెకి ఐరన్‌లెగ్ అనే పేరు వచ్చింది. తాజాగా నాగచైతన్య సరసన మారుతి దర్శకత్వంలో వచ్చిన 'శైలజరెడ్డి అల్లుడు'లో నటించింది. కానీ ప్రస్తుతం ఈ అమ్మడు కెరీర్ టాలీవుడ్‌లో ఆశించిన విధంగా లేదు. కానీ ఈమెకి కోలీవుడ్‌లో మాత్రం మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ధనుష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంతో పాటు మరో రెండు తమిళ చిత్రాలలో కూడా నటిస్తోంది.
తాజాగా ఈమె మాట్లాడుతూ, తమిళ చిత్రాలలో మంచి అవకాశాలు వస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుని ప్రేక్షకుల మెప్పును పొందుతాను. నేను చదువుకునే రోజుల్లో నలుగురు యువకులు నాకు ప్రపోజ్ చేశారు. ప్రేమ అనేది ఇద్దరి హృదయాలను కలిపే అద్భుతమైన విషయం. పెళ్లంటూ చేసుకుంటే ప్రేమపెళ్లే చేసుకుంటానని స్పష్టం చేసింది. మొత్తానికి నేటి జనరేషన్ యువతిగా ఈమెకి ప్రేమ, పెళ్లి విషయంలో స్పష్టమైన అభిప్రాయం ఉందనే చెప్పాలి.