బాలకృష్ణ.. నేటి సీనియర్ స్టార్ అయిన ఈయనకు పెద్దగా కొత్త, యంగ్ దర్శకులతో చేసిన సినిమాలు కలిసి రాలేదు. బోయపాటి శ్రీను, క్రిష్ వంటి వారు బాగానే కలిసి వచ్చినా కూడా ఈయన 'సీమసింహం' ద్వారా చాన్స్ ఇచ్చిన రాంప్రసాద్, 'వీరభద్ర' ద్వారా ఎఎస్ రవికుమార్ చౌదరి, 'విజయేంద్రవర్మ' స్వర్ణ సుబ్బారావు, 'ఒక్కమగాడు' వైవిఎస్ చౌదరి, 'మిత్రుడు' మహదేవ్, 'అధినాయకుడు' పరుచూరి మురళి, 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' శేఖర్‌రాజా, 'శ్రీమన్నారాయణ' రవిచావలి, 'లయన్' సత్యదేవ్, 'డిక్టేటర్' శ్రీవాస్, 'పైసావసూల్' పూరీజగన్నాథ్ వంటి వారు ఏమాత్రం కలిసి రాలేదు. ఈ చిత్రాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.
ప్రస్తుతం బాలకృష్ణ తనకి 'గౌతమీపుత్రశాతకర్ణి' వంటి హిట్‌ని ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో తన తండ్రి బయోపిక్‌గా వస్తోన్న 'ఎన్టీఆర్' చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం ముందు బాలకృష్ణ, అనిల్‌రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడని వార్తలు వచ్చాయి. టైటిల్ కూడా 'రామారావుగారు' అని ప్రచారం జరిగింది. కానీ అనిల్‌రావిపూడి, బాలకృష్ణలు తమ తమ ప్రాజెక్ట్‌లలో బిజీ కావడంతో ఈ కాంబినేషన్‌లో చిత్రం ఇక ఉండదని అందరు భావించారు. కానీ ఒక్కసారి మాట ఇస్తే మాట మీద నిలబడే బాలయ్య 'ఎన్టీఆర్' బయోపిక్ అనంతరం చేయబోయేది అనిల్‌రావిపూడి దర్శకత్వంలోనే అని తెలుస్తోంది. అనిల్‌రావిపూడి ప్రస్తుతం మరో సీనియర్‌స్టార్ వెంకటేష్, యంగ్ మెగాహీరో వరుణ్‌తేజ్‌లతో దిల్‌రాజు బేనర్‌లో 'ఎఫ్ 2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) చిత్రం చేస్తున్నాడు. అనిల్‌రావిపూడి 'ఎఫ్ 2', బాలయ్యల 'ఎన్టీఆర్'లు పూర్తయిన తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కుతుందని సమాచారం.
నేటి యంగ్ దర్శకుల్లో కథాబలం కంటే ప్రతి చిత్రాన్ని ఎంటర్‌టైనర్‌గా మలచడంతో అనిల్‌రావిపూడి అతి తక్కువ చిత్రాలతోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. నందమూరి కళ్యాణ్‌రామ్‌తో 'పటాస్', సాయిధరమ్‌తేజ్‌తో 'సుప్రీం', రవతేజతో 'రాజా ది గ్రేట్' చిత్రాల ద్వారా అనిల్‌రావిపూడి హ్యాట్రిక్ హిట్స్‌ని కొట్టాడు. ఈయన నిజానికి 'రాజా దిగ్రేట్' చిత్రాన్ని నందమూరి యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో చేయాలని భావించాడు. కానీ ఎన్టీఆర్ ఆ చిత్రం స్థానంలో బాబి దర్శకత్వంలో 'జైలవకుశ' చేశాడు. మొత్తానికి ఎన్టీఆర్‌తో చిత్రం మిస్ అయినా బాలయ్యతో ఓకే చేయించుకున్న అనిల్‌రావిపూడి వరుసగా వెంకటేష్, బాలయ్య వంటి ఇద్దరు సీనియర్‌స్టార్స్‌ని లైన్‌లో పెట్టడం గమనార్హం.