తన తండ్రి శివకుమార్ కోలీవుడ్‌లో మంచి నటుడే అయినా కూడా కేవలం తన తండ్రి నీడలో తాను ఎదగడం ఇష్టం లేక సినిమాలలోకి రాకముందు సూర్య ఉరఫ్ శరవణన్ శివకుమార్ ఒక ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలో 800 రూపాయల జీతానికి పనిచేశాడు. హీరోగా మంచి స్థాయిలో ఉన్నప్పటికీ అగరం ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి ఎందరో పిల్లలకు చదువు, మౌళిక వసతులు, పౌష్టికాహారం, ప్రమాదకర వ్యాధులకు ఉచిత చికిత్స వంటివి అందిస్తూ ఉన్నాడు. నటునిగా ఎదిగే కొద్ది తన సామాజిక సేవ కార్యక్రమాలను కూడా విస్తృతం చేస్తున్నాడు.తన అభిమానుల అత్యుత్సాహాన్ని ఆపుతూ, తన కాళ్లకుమొక్కే వారికి తానే తిరిగి మొక్కి తాను కూడా సామాన్య మానవుడినే అని నిరూపించుకుంటారు.
ఇక విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో ‘ఎన్‌జీకే’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. మరోవైపు సేవాకార్యక్రమాలలో భాగంగా ఆయన మరిన్నింటికి శ్రీకారం చుట్టాడు. తెరపై అన్యాయాలను ఎదిరించే హీరోగానే కాదు.. నిజజీవితంలో మానవత్వంతో స్పందించే రియల్‌హీరో సూర్య. తాజాగా అరుదైన వ్యాధితో బాధపడుతోన్న దినేష్ అనే బాలునికి తనకిష్టమైన హీరోని చూడాలని ఆశకలిగింది. ఈ విషయం తెలుసుకున్న సూర్య ఆ పిల్లాడిని తన ఇంటికి పిలిపించుకుని సరదాగా గడిపాడు. ఆ పిల్లాడికి పలు కానుకలు ఇవ్వడంతో పాటు సెల్ఫీలు తీసుకుని బాలుడిని ఉత్సాహపరిచాడు.
అంతేకాదు... ఆ పిల్లాడి వైద్యఖర్చులకు ఎంత ఖర్చయినా తానే భరిస్తానని హామీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆ పిల్లాడి తల్లిదండ్రులు సూర్యకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అందరు సూర్య మంచి మనసును అభినందిస్తున్నారు.