ప్రతి విషయానికి రెండు కోణాలుంటాయి. నాణేనికి బొమ్మబొరుసు ఉన్నట్లే ప్రతి వాదనకు రెండు కోణాలుంటాయి. గోడకి కొట్టిన బంతి వేగంగా మన వద్దకే వస్తుంది. ఈ ఊరుకి ఆ ఊరు ఎంత దూరమో.. ఆ ఊరుకి ఈ ఊరు కూడా అంతే దూరం. ఇక విషయానికి వస్తే గత కొన్ని రోజులుగా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య విషయంలో ఒక్కొక్కరు ఒక్కో వాదన వినిపిస్తున్నారు. ఏది నిజం.. కాదు అబద్దం అనేవి పక్కన పెడితే ప్రాణం పోయలేని మనిషికి ప్రాణం తీసే హక్కు లేదు. కొట్టడం, చంపడం వంటివి తీవ్రంగా ఖండించాల్సిన విషయాలు. కానీ మనుషుల్లో ఎందరు కుల, మతాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నారు? బయట ఎన్నో ఉపన్యాసాలు చేసే మేధావులు తమ ఇంటికి, పిల్లల విషయానికి వచ్చే సరికి ఇలాంటి వాటిని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారా? అంగీకరిస్తున్నారా? నేడు సమాజంలో నిజంగా అగ్రవర్ణాలు, దళితులు అనే బేధం ఇంకా ఉందా? అంటే కాస్త అనుమానమే. నేడు సమాజంలో కేవలం రెండు వర్గాల ప్రజలే ఉన్నారు. వారే ధనవంతులు.. పేదవారు. మరో రకంగా చెప్పుకోవాలంటే బలవంతులు, బలహీనులు. నిజానికి మారుతిరావు విషయంలో ప్రణయ్ ఏ కులస్థుడైనా సరే తనకంటే ధనవంతుడు అయి, బలవంతుడు అయితే మారుతిరావు తన కూతురిని ప్రణయ్‌కి ఇచ్చి వివాహం చేసి ఉండేవాడే. లేదా కులోన్మాది అయితే ప్రణయ్ కేవలం దళితుడు, క్రిస్టయన్ అనే కాదు.. ప్రణయ్ స్థానంలో తన కులం కంటే పెద్దకులం వాడు ఉండి ఉన్నా అదే పని చేసేవాడు. దీనికి కొన్ని ఉదాహరణలు మన టాలీవుడ్‌లోనే ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు తండ్రిని ఎదిరించి వివాహం చేసుకున్న భరద్వాజ్ గానీ, ఆయన పెద్దకూతురితో నిశ్చితార్ధం కూడా జరిగిన ఉదయ్‌కిరణ్‌లు, చిరు సామాజిక వర్గంతో పోల్చుకుంటే ఆయనకంటే పైస్థాయి కులస్తులే. కానీ చిరు ఒప్పుకోలేదు. అదే తన కుమారుడు రామ్‌చరణ్ విషయానికి వస్తే ఏకంగా అపోలో ప్రతాప్ రెడ్డితో బంధుత్వం కలుపుకున్నాడు. మంచు విష్ణు, మంచు మనోజ్ వంటి వారు ఇతర డబ్బున్న వారిని చేసుకుంటే ఆనందంగా ఒప్పుకున్న మోహన్‌బాబు లక్ష్మీప్రసన్న మొదటి భర్త విషయంలో మాత్రం దానికి విరుద్దంగా ప్రవర్తించాడు. ఇక నా అల్లుడు అమెరికాలో ఉద్యోగం చేసే వ్యక్తిని వివాహం చేసుకోవాలి... మా అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయి అమెరికాకి వెళ్లితే మా అబ్బాయికి కోటి రూపాయల కట్నం అదేనండీ ప్యాకేజీ అనేవి కూడా పరువు మాటలే.
ఇక విషయానికి వస్తే ప్రణయ్ విషయానికి వస్తే రాంగోపాల్‌వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. అమృత తండ్రి ఒక పిరికి, క్రూరమైన క్రిమినల్. ప్రణయ్‌ని హతమార్చడం ఆయనకు గౌరవమా? ఒకవేళ ఇది పరువు హత్యే అయితే మారుతి రావు కూడా చావడానికి రెడీగా ఉండాలి. పరువు కోసం హత్యలు చేసే వారిని హత్య చేయడమే నిజమైన పరువు హత్య అని తెలిపాడు. కానీ నిజానికి అమృత, ప్రణయ్‌లు బాధితులు కాబట్టి అందరు వారిపైనే సింపతీ చూపుతున్నారు. కానీ నేటి యువత తమ తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఆలోచిస్తే మనకి మరో కోణం కనిపిస్తుంది. నేడు ప్రేమ, దోమ అంటూ స్కూల్ వయసు నుండే ప్రేమలు, పొదలచాటు చీకటి పనులు చేసే యువత నేడు తమకి పెళ్లయి తల్లిదండ్రులుగా మారితే అప్పుడు విషయం అర్దమవుతుంది. అయినా మారుతిరావు తన కూతురు, ప్రణయ్‌ని వివాహం చేసుకున్న తర్వాత దయచేసి ఆ ఊరిలో ఉండవద్దని, దాని వల్ల తనకు అవమానాలు ఎదురవుతాయని, మరో చోట కాపురం పెడితే తానే ఆర్ధిక సాయం కూడా చేస్తానని చెప్పినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
కానీ మారుతిరావుని రెచ్చగొట్టే విధంగా అక్కడే రిసెప్షన్ వంటివి పెట్టి, తాగి తూలుతూ, మారుతిరావుని కావాలని టార్గెట్ చేసి, ఇగోలను రెచ్చగొట్టడం కూడా సరికాదు. ఇక తాజాగా ఓ బడా దళిత వ్యక్తి, క్రిస్టియన్ మతం పుచ్చుకున్న ఓ యువకుడు ఎవరైనా దళిత, క్రిస్టియన్ వ్యక్తులు పెద్ద కులాల పిల్లలను టార్గెట్ చేసి వారిని వివాహం చేసుకుంటే లక్షలు నజరానాగా ఇస్తానని ప్రకటించడం ఎంత వరకు సమంజసం..?