ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయకుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. ఈయన మణిరత్నం 'గీతాంజలి' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 'శత్రువు, లారీడ్రైవర్, కిల్లర్, పెద్దరికం, భైరవద్వీపం, ఆటోడ్రైవర్', చిరంజీవితో 'స్నేహం కోసం', 'అరుంధతి, సింహరాశి, వాసు, సాంబ, భగీరథ, సీతాకోకచిలుక, భగీరథ, తులసి, 100%లవ్, శ్రీమన్నారాయణ, నేను శైలజ, సరైనోడు, జనతాగ్యారేజ్' వంటి పలు చిత్రాలలో నటించాడు. ఇక ఈయనకు ముత్తుకన్నన్ , నటి మంజులు భార్యలు. ఆయన పిల్లలైన అరుణ్ విజయ్, వనిత, ప్రీతి, శ్రీదేవి, కవిత, డాక్టర్ అనిత పిల్లలు. ఇక ఈయనకు కుమార్తెల్లో ఒకరైన వనిత ఎప్పుడు ఏదో రూపంలో వివాదాలలో ఉంటూనే ఉంటుంది. ప్రేమ, పెళ్లి, కన్నతండ్రితో పాటు కుటుంబసభ్యులతో కూడా ఈమెకి ఎన్నోవిభేదాలు ఉన్నాయి.
ఇక తాజాగా ఈమెపై ఆమె తండ్రి విజయ్‌కుమార్ స్వయంగా కేసుపెట్టాడు. చెన్నైలోని మధురవాయిల్ స్టేషన్‌లో పోలీస్ కేసు పెట్టాడు. అలపాక్కమ్‌లోని అష్టలక్ష్మినగర్, 11వ వీధిలో ఉన్న తన ఇంటిని ఆమె ఆక్రమించుకుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఇంటిని సినిమాల షూటింగ్‌లకు అద్దెకిస్తుంటామని, కొట్టివాకమ్‌లోని మరో ఇంట్లో తాను కుమారుడు అరుణ్‌విజయ్‌తో కలిసి ఉంటున్నామని తెలిపాడు. తాను షూటింగ్‌ల కోసం తన కూతురు తన ఇంటిని అద్దెకు తీసుకుందని, కానీ ఆమె దానిని ఖాళీ చేయకుండా తమను రౌడీలు, గూండాలతో బెదిరిస్తోందని తెలిపాడు.
కానీ వనిత మాత్రం ఈ ఇంటిలో విజయ్‌కుమార్ కూతురినైన నాకు కూడా వాటా ఉందని, అందుకే ఖాళీ చేయనని పోలీసులకు స్పష్టం చేసింది. ఇల్లు మీదే అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని పోలీసులు ప్రశ్నించడంతో ఈమె వారితో వాగ్వివాదానికి దిగింది. ఈ విషయం తెలుసుకున్న మీడియా అక్కడకు వెళ్లగా, ఫొటోగ్రాఫర్ల కెమెరాలను తీసి నేలకి కొట్టింది. ఎప్పటినుంచో తండ్రి విజయ్‌కుమార్‌కి, వనితకు మనస్పర్ధలున్నాయి. ఇక వనిత 'దేవి' అనే తెలుగు చిత్రంలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైంది.