సోషల్‌మీడియా ద్వారా బాగా పాపులర్ అయిన హీరో సంపూర్ణేష్‌బాబు. ఆయన నటించిన మొదటి చిత్రం ‘హృదయకాలేయం’ మంచి విజయం సాధించింది. ఇక నాడు అలాంటి పేరడీ చిత్రాలకు బాగా ఆదరణ లభిస్తూ ఉండేది. అదే సమయంలో అల్లరినరేష్ నుంచి సంపూ వరకు అందరు పేరడీల బాట పట్టారు. పెద్ద పెద్ద చిత్రాలలో కూడా కమెడియన్స్ చేత పేరడీలు చేయిస్తూ బాగా హిట్టయిన చిత్రాలు ఉన్నాయి. ఆ సమయంలోనే మొదలైన చిత్రం ‘కొబ్బరిమట్ట’. ఈ చిత్రం టీజర్‌ని ఆ మద్య విడుదల చేస్తే అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. అందునా సంపూ సింగిల్ టేక్‌లో సినిమాల మీద, పెళ్లాల మీద వేసిన సెటైర్ డైలాగ్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రం ఆనాడే విడుదలై ఉంటే బాగానే ఆడిఉండేదేమో... !
కానీ ప్రేక్షకులు పేరడీలను తిరస్కరిస్తున్న సమయంలో ఈ ‘కొబ్బరి మట్ట’ విడుదల అవుతోంది. కనీసం బిగ్‌బాస్ సీజన్1లో సంపూ పార్టిసిపేట్ చేసిన ఊపులో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయలేకపోయారు. మరి ఈ ఆలస్యం సంపూకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచిచూడాల్సివుంది. ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం నుంచి ఓ ప్రోమో సాంగ్‌ని యూనిట్ విడుదల చేసింది.
ఐదుగురు అన్నదమ్ముల నేపధ్యంలో సాగే చిత్రం ఇది. ఈ బంధాన్ని ప్రోమోలు చూపించిన విధానం మాత్రం సరదాగానే ఉంది. మరి కొంతకాలంగా స్పీడ్ తగ్గించిన సంపూ ఈ చిత్రంతో మరలా బిజీ అవుతాడో లేదో చూడాలి. మరోవైపు సంపూ.. జనసేనలో చేరనున్నాడని ఆయన తెలంగాణ ఎన్నికల్లో జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.