ఎవరు అవునన్నా కాదన్నా సీనియారిటీ అనేది ఎంతో విలువైనది. అనుభవంతో పెద్దలు చెప్పే మాటలు అక్షరసత్యాలు. కానీ కొందరు మాత్రం అలాంటి అనుభవజ్ఞులకు కాలం చెల్లిందని, సినిమాల ట్రెండ్ మారిందని, ఆడియన్స్ పల్స్ మారిందని అంటూ ఉంటారు. కానీ ఎంత ఫేడవుట్ అయినా, ఫ్లాప్‌లు వచ్చినా కూడా దాసరి, కె.విశ్వనాథ్, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, మణిరత్నం వంటి వారు అనుభవం ఎంతో అమూల్యమైనది. పెద్దల మాట చద్దిమూట అనే సామెతను మర్చిపోరాదు. నేటి దర్శకులు, రచయితలు ఒకటి రెండు చిత్రాలకే తమ పసనంతా కోల్పోతున్న తరుణంలో ఏళ్లకు ఏళ్లుగా ప్రేక్షకులను రంజింపజేస్తూ వచ్చిన వారి ఎక్స్‌పీరియన్స్‌ని తక్కువగా అంచనా వేయలేం. అలాంటి వారిలో రచయితలు, దర్శకులు అయిన పరుచూరి సోదరులు ముందుంటారు.
నాలుగైదు చిత్రాలకే మేం ఏమి రాస్తే అదే డైలాగ్, తాము ఏది తీస్తే అదే సినిమా అనే విధంగా కొందరు ప్రవర్తిస్తూ ఉంటారు. దీనికి ఉదాహరణగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్లక్ష్యంగా తీసిన ‘అజ్ఞాతవాసి’, ఇంక శ్రీను వైట్ల ‘ఆగడు’ చిత్రాలు ఓ చక్కని ఉదాహరణ. ఇక విషయానికి వస్తే తాజాగా పరుచూరి గోపాలకృష్ణ ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టి 10కోట్ల పెట్టుబడికి 100కోట్లకు పైగా వసూలు చేసిన ‘గీతాగోవిందం’ చిత్రం ఎందుకు ప్రేక్షకులను అంతగా అలరించిందో వివరించారు.
‘బస్సులో జరిగిన సంఘటన వల్ల హీరో అంటే హీరోయిన్‌కి చెడు అభిప్రాయం కలుగుతుంది. హీరో చెల్లెలికి హీరోయిన్ అన్నయ్యకు పెళ్లి. ఆ వెడ్డింగ్ కార్డ్స్‌ను హీరోహీరోయిన్లు పంచుతూ ఉంటారు. ఆ సమయంలో హీరో సెల్‌ఫోన్‌లోని ఓ వీడియోను హీరోయిన్ చూస్తుంది. ఆయనపై ఉండే చెడు అభిప్రాయం మరింతగా పెరుగుతుంది. ఈ విషయంలో హీరోయిన్‌కి నిజం తెలిసి.. హీరో వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్ధమవుతుంది. దాంతో హీరోని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ సమయంలో హీరో ఎగిరి గంతేస్తాడని అందరు అనుకుంటారు. కానీ ఆమెని హీరో పెళ్లి చేసుకోవడానికి అంగీకరించకపోవడంతో కథ మరో ఆసక్తికర మలుపు తిరుగుతుంది. ఇలాంటి ఊహించలేని ట్విస్ట్‌లే ఆ చిత్రానికి ప్రాణం పోసి, సినిమా ఘన విజయం సాధించడానికి కారణమైయ్యాయి... అని వివరించారు. ఈ విషయంలో పరుచూరి చెప్పిన మాట అక్షరసత్యమనే చెప్పాలి.