నేడు సినిమా విజయం సాధించింది అంటే క్రెడిట్ అంతా హీరో, హీరోయిన్లు, తెరపై కనిపించే తారాగణం, లేదంటే దర్శకుల ఖాతాలలో మాత్రమే పడుతుంది. ఇక నిర్మాతలకు హిట్ అయితే లాభాలు, ఫ్లాప్ అయితే నష్టాలు మామూలే. కానీ సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిభ ఉండి, సినిమాల విజయంలో కూడా తనవంతు పాత్రలను పోషించే ఇతర టెక్నీషియన్స్‌కి మాత్రం గుర్తింపు రాదు. ముఖ్యంగా నేటి రోజుల్లో పాటల రచయితలకు, గాయనీ గాయకులకు ఇచ్చేపారితోషికం పెరగకపోగా, రోజు రోజుకి తగ్గుతోంది. కొత్తవాళ్ల హవా కూడా ఎక్కువగా ఉండటం, పోటీ ఎక్కువ కావడంతో నిర్మాతలు కూడా నువ్వు ఫలానా రెమ్యూరేషన్‌కి పాట రాస్తావా? లేక పాడుతావా? లేదంటే ఉచితంగా పాడటానికి ఎందరో లైన్లో ఉన్నారని బ్లాక్‌మెయిల్ చేసే స్థాయికి పరిస్థితి చేరింది.
హీరో, హీరోయిన్లు, నటీనటుల పారితోషికాలు పెరుగుతున్నాయో గానీ ఇలాంటి వారి రెమ్యూనరేషన్లు మాత్రం రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. నేటి పాటల రచయితలకు, గాయనీ గాయకులకు పాటకి మూడు నాలుగు వేలు మాత్రమే ఇస్తున్నారంటే వారి ప్రతిభను ఎంత తక్కువగా అంచనా వేస్తున్నారో అర్ధమవుతోంది. ఇక వీటికితోడు ఏదో ఒక పాట హిట్టయితే వారిపై అదే ముద్ర వేసి కేవలం అలాంటి పాటలకే పరిమితం చేస్తూ వస్తున్నారు. ఇక విషయానికి వస్తే అతి పిన్న వయసులోనే సినీ సాహిత్యంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న రచయిత అనంత శ్రీరాం. ఇతను 12వ ఏట నుంచే పాటలు రాయడం మొదలుపెట్టాడు. మొదటగా ‘కాదంటే ఔననిలే’ చిత్రం ద్వారా సోలో కార్డు వేయించుకున్నాడు. ప్రముఖ నిర్మాత, రాజకీయ నాయకుడైన చేగొండి హరిరామజోగయ్య ఈయనకు పెద్దనాన్న. ఇతని పూర్తి పేరు కూడా చేగొండి అనంత్‌శ్రీరాం. ఆ తర్వాత ఆయనకు ‘అందరివాడు, యమదొంగ’ వంటి పలు చిత్రాల ద్వారా ఎంతో గుర్తింపు వచ్చింది. కానీ ఈయనను సిరివెన్నెల సీతారామశాస్త్రి తరహాలోనే భావకవిగా ముద్ర వేసి కేవలం అలాంటి అవకాశాలే ఇచ్చి ఈయనపై అలాంటి ముద్ర వేశారు.
తాజాగా ఈయన మాట్లాడుతూ.. పాటల స్వరూప, స్వభావాలను, సందర్భాలను దృష్టిలో ఉంచుకుని మాటల పొందిక చేయడం ముఖ్యం. నా కెరియర్లో ఇప్పటి వరకు నన్ను బాగా ఇబ్బంది పెట్టేసిన పాట ‘బాహుబలి’లోని ‘పచ్చబొట్టేసిన’ పాట. ఈ పాటకు పూర్తి స్వరూపాన్ని తీసుకుని రావడానికి నాకు 73రోజులు పట్టింది. గిరిజనుల మద్య పెరిగిన హీరో, విప్లవకారుల మధ్య పెరిగిన హీరోయిన్స్‌ల మద్య ఈ పాట వస్తుంది. వాళ్లిద్దరి మద్య సమతుల్యాన్ని పాటించే పదజాలం ఏది వాడాలన్న మీమాంసవల్ల ఎక్కువ సమయం పట్టేసింది.. అంటూ ఈ నూనుగు మీసాల యువగేయరచయిత చెప్పుకొచ్చాడు. ప్రత్యేకమైన ఆయన శైలి పాలమీగడలో పంచదారలా అనిపిస్తుంది. ఆ తియ్యదనమే మనసులను పట్టుకుంటుందని ఆయన పడే కష్టం చూస్తే అనిపించకమానదు.