సినిమా అంటే ఒక విధంగా గ్యాంబ్లింగ్‌తో సమానం. సినిమా విజయానికి, పరాజయానికి అందరు బాధ్యులే అయినా పెట్టుబడి పెట్టే నిర్మాత మాత్రమే నష్టాలను భరించాల్సివస్తుంది. సినిమా నిర్మాణంలో అనుకోని అవాంతరాలు వచ్చినా పూర్తిగా నష్టపోయేది నిర్మాత మాత్రమే. అందుకే అతను సినిమాకి మూలస్థంభం. ఇక విషయానికి వస్తే కోలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ కార్తి. ఈయన ఇటీవల వచ్చిన 'ఊపిరి' చిత్రం ద్వారా నేరుగా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. ఈయన అన్న స్టార్ సూర్య ఎప్పటి నుంచో అదే కల కంటున్నా ఆయనకు మాత్రం అది ఇంకా నెరవేరలేదు.
మరోపక్క సూర్యతో పోల్చుకుంటే ప్రస్తుతం కార్తికే విజయాలు లభిస్తుండటం గమనార్హం. ఇంతకు ముందు కార్తీ, రకుల్‌ప్రీత్‌సింగ్‌తో కలిసి నటించిన 'ఖాకీ' చిత్రం బాగానే విజయం సాధించింది. దాంతో అదే క్రేజీ కాంబినేషన్‌లో ప్రస్తుతం మరో చిత్రం రూపొందుతోంది. కార్తీ కెరీర్‌లోనే 50కోట్ల భారీ బడ్జెట్‌తో ఇది రూపొందుతూ ఉండటం విశేషం. ఈ చిత్రానికి 'దేవ్' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత లక్ష్మణ్ లావిష్‌గా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను 'కులుమనాలి'లో చిత్రీకరిస్తున్నారు. కానీ అక్కడి వరదల కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది.
యూనిట్‌లోని 140మంది వరదల్లో చిక్కుకున్నారు. ఈ అనుకోని వైపరీత్యం కారణంగా నిర్మాతకు ఒకటిన్నర కోటి నష్టం వాటిల్లినట్లు సమాచారం. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ కీలకమైన పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రాన్నిక్రిస్‌మస్ కానుకగా డిసెంబర్ 21న విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి ఈ అవాంతరం వల్ల సినిమా ఆలస్యం అవుతుందా? నిర్మాతకు అనుకోని నష్టాలను మిగిల్చిన ఈ చిత్రం విజయం సాధించి నిర్మాతకు లాభాలను తెచ్చిపెడుతుందో లేదో వేచిచూడాల్సివుంది.!