దేశంలో నిర్భయ వంటి కేసులు సామాన్యమై పోతున్నాయి. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు కూడా మతం రంగుని పులిమి రాజకీయం చేసే దౌర్భాగ్య పరిస్థితులు తలెత్తాయి. ఉత్తరప్రదేశ్‌లో సామాజికంగా ఎంతో బలం ఉన్న ఎమ్మెల్యే, ఆయనసోదరుడు ఓ బాలికపై మానభంగం చేస్తే బాధితురాలికి కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని సీఎం నిందితులైన ఎమ్మెల్యేలకు టైం ఇచ్చాడు. వారు బయటకి వచ్చి ఎవ్వరూ తమని ఏమీ చేయలేరని బహిరంగంగా వ్యాఖ్యానించాడు. నిందులపై చర్యలు తీసుకోలేని పోలీసులు కేసు వాపస్ తీసుకోమని ఆ బాలిక తండ్రిని మాత్రం చిత్రహింసలు పెట్టి మరణానికి కారణమయ్యారు.
ఇక జమ్మూకాశ్మీర్‌లో సంచార తెగకి చెందిన ఓ ఎనిమిదేళ్ల బాలికపై గుడిలో మానభంగం చేశారు. దీనిలో ప్రభుత్వ ఉన్నతోదోగ్యులు కూడా ఉన్నారు. కానీ ఆ సంచార తెగ మతపరంగా చూసుకుంటే ముస్లింలు కావడంతో హిందు సంస్థలు మానభంగానికి మద్దతుగా ర్యాలీ చేశాయి. ఇందులో టీడిపి, బిజెపికి ప్రభుత్వానికి చెందిన ఇద్దరు మంత్రులు కూడా పాల్గొన్నారు. వీటిపై మాత్రం మోదీకి నోరు విప్పే సమయం లేదు. ఆయన పార్టీలోని మహిళా మంత్రులైన సుష్మాస్వరాజ్, స్మృతిఇరానీ, నిర్మాలా సీతారామన్‌లకు కనీసం ఖండన కాదు కదా.. బాధితురాళ్లకు న్యాయం జరగాలని కూడా కోరలేదు.
ఇక విషయానికి వస్తే అంతర్జాతీయంగా కూడా పేరు తెచ్చుకున్న నటి, గాయకురాలు, నిర్మాత అయిన ప్రియాంకాచోప్రా ఆడవారి విషయంలో జరుగుతున్న అన్యాయాలపై గళం విప్పింది. అన్ని చెప్పిన ఆమెకి కూడా ఈ రెండు ఘటనలను ఖండించే ధైర్యం లేకపోయింది. ఈమె మాట్లాడుతూ..శారీరకంగా స్త్రీ, పురుషుల మద్య తేడాలుంటాయి. స్త్రీలకు కూడా సమాన అవకాశాలివ్వాలి. ఓ సంస్థకు సీఈవోలు అయ్యే అవకాశం కూడా ఇవ్వాలి. ముగ్గురుపిల్లలను చూసుకుంటూ కూడా స్త్రీ సీఈవోగా రాణించగలదు. ఆ శక్తి ఆమెకి ఉంది. అవకాశం ఇవ్వకుండా ముగ్గురు పిల్లల తల్లివి నువ్వు సీఈవోగా ఏమి న్యాయం చేస్తావని ప్రశ్నించడం సరికాదు. అమ్మాయిలను ఏడిపిస్తే ఏ అబ్బాయికైనా చీవాట్లు పెట్టకూడదు. అలాంటి వారికి చెంపదెబ్బే సమాధానం కావాలి.. అని చెప్పింది. కనీసం ఈ విషయంలోనైనా ఆమె కాస్తచొరవ చూపినందుకు అభినందించాల్సిందే....!