ఢిల్లీకి చెందిన బబ్లీగర్ల్‌గా తెలుగులో మంచి పేరును తెచ్చుకున్న నటి రాశిఖన్నా. ఈమె 2013లో సినీరంగ ప్రవేశం చేసింది. బాలీవుడ్ చిత్రం 'మద్రాస్ కెఫే' చిత్రం కోసం నటనలో ప్రత్యేక శిక్షణ పొంది మరీ భారత ఇంటెలిజెన్స్ అధికారి విక్రమ్ సింగ్ భార్య రూబిసింగ్ పాత్రలో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత ఈమె అవసరాల శ్రీనివాస్ నటునిగా, దర్శకునిగా తెరకెక్కించిన చిత్రం 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. దీని కంటే ముందే 'మనం' చిత్రంలో ఓ అతిధిపాత్రలో కనిపించింది. 'జోరు' చిత్రంలోనే టైటిల్ సాంగ్‌ని పాడి మెప్పించింది. ఆ తర్వాత గోపీచంద్ 'జిల్', రవితేజ 'బెంగాల్‌టైగర్', రామ్ 'శివం' చిత్రాలలో నటించింది.
కానీ ఈమెకి 'సుప్రీం'లో సాయిధరమ్‌తేజ్ సరసన చేసిన బెల్లంకొండ శ్రీదేవి పాత్ర మంచి పేరును తెచ్చిపెట్టింది. మరలా రామ్‌తో 'హైపర్', జూనియర్ ఎన్టీఆర్‌తో 'జైలవకుశ', మరోసారి రవితేజతో 'టచ్ చేసి చూడు', గోపీచంద్‌తో 'ఆక్సిజన్' వంటి చిత్రాలలో యాక్ట్ చేసింది. కానీ 'సుప్రీం' తర్వాత ఆమెకి మరో మంచి పాత్రను తెచ్చిపెట్టిన చిత్రంగా 'తొలిప్రేమ'ని చెప్పాలి. కానీ ఆ వెంటనే వచ్చిన 'శ్రీనివాసకళ్యాణం'ఈమెని మరోసారి నిరాశపరిచింది. ఈమెతో పాటు అటు ఇటుగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన రకుల్ ప్రీత్‌సింగ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగినా కూడా ఈమెకి మాత్రం ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వచ్చినా దానిని నిలబెట్టుకోలేకపోయింది. నిజానికి ఈమె మల్టీ టాలెంటెడ్ నటి. పాడగలదు... కవిత్వాలు కూడా చెప్పగలదు.
ఈమె తాజాగా మాట్లాడుతూ, తనలో ఉన్న కమెడియన్ ఇంకా బయటకు రాలేదని, అవకాశం వస్తే తనలోని ఆ యాంగిల్‌ని కూడా ప్రూవ్ చేయగలనని తెలిపింది. ఇంకా ఆమె మాట్లాడుతూ, ఏ పరిశ్రమలోనైనా పోటీ ఉంటుంది. ఒక మనిషిగా ఎదగాలన్నా.. పడిపోవాలన్నా పోటీ ఉంటేనే సాధ్యం. పోటీ లేకపోతే ఎక్కడ ఉంటామో అక్కడే ఆగిపోతాం. పోటీని నేనెప్పుడు స్వీకరిస్తాను. పోటీ అనేది ఆరోగ్యకరంగా ఉండాలి. నేను నా ఫ్రెండ్స్ రకుల్ ప్రీత్‌సింగ్, రెజీనా, లావణ్యత్రిపాఠీలం పోటీ పడి పనిచేస్తాం. అయితే ఆ పోటీ ప్రొఫెషన్ వరకే. షూటింగ్ పేకప్ అయిన తర్వాత మేమంతా స్నేహితులమేనని తెలిపింది.