బిగ్‌బాస్ సీజన్ 1కి బిగ్‌బాస్ సీజన్2కి తేడా ఏమిటంటే.. పార్టిసిపెంట్స్ మారడం, హోస్ట్‌గా ఎన్టీఆర్ బదులు నాని రావడం మాత్రమే కాదని చెప్పాలి. మొదటి సీజన్ పూణెలో నిర్వహించినందు వల్ల అప్పుడు ఈ సారి జరిగినట్లుగా లీక్‌లు జరగలేదు. ఈసారి అన్నపూర్ణ స్టూడియో సెట్స్ వేయడంతో ప్రతి విషయంలోనూ మీడియాకే కాదు.. అందరికీ లీక్‌లు అందాయి. ఎవరు ఎలిమినేట్ కానున్నారు? ఎవరు గెలిచే అవకాశం ఉందనే విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో నిర్వాహకులు విఫలం అయ్యారనే చెప్పాలి. ఇక పార్టిసిపెంట్స్‌లో కౌశల్‌కి ఎన్నడూ, ఏ భాషల్లో లేనంతగా కౌశల్ ఆర్మీ అంటూ ఏర్పడి ఫలితాలను వారే శాసించారు. ఎవరు ఎలిమినేట్ కావాలి? ఎవరు నిలబడాలి? అనే విషయాలు అందరి చేతుల్లోంచి కౌశల్ ఆర్మీ చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఏకంగా కౌశల్ ఆర్మీ హైదరాబాద్‌లో 2కె రన్ నిర్వహించడం, ఆసియా కప్ క్రికెట్‌లో కూడా కౌశల్ ఆర్మీ బేనర్లు కనిపించడంతో పరిస్థితి ఏమిటో అందరికీ అర్ధం అయింది.
ఇక కౌశల్ ఆర్మీ సభ్యులు ఫైనల్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్‌కి వెళ్లి రచ్చరచ్చ చేసి, విన్నర్ కౌశలే అని పోస్టర్లు కూడా అంటించివచ్చారు. ఇక ఈ షో టెలికాస్ట్‌కి ముందే విన్నర్‌గా కౌశల్ తన అభిమానులకు అభివాదం చేస్తూ వాహనం ఎక్కడం వంటివి సోషల్‌మీడియాలో హల్‌చల్ చేశాయి. మాధవీలత, అభి వంటి వారు కూడా సోషల్‌మీడియాలో కౌశలే విన్నర్ అని ముందుగానే ప్రకటించారు. ఇక విషయానికి వస్తే విన్నర్‌గా నిలిచిన కౌశల్‌కి రూ.50 లక్షల ప్రైజ్ మనీని ఫైనల్‌కి అతిథిగా వచ్చిన వెంకటేష్ అందించాడు. ఈ విషయంలో మాత్రం కౌశల్ తన పెద్ద మనసు చాటుకున్నాడు. తన తల్లి క్యాన్సర్‌తో మరణించిందని, అందువల్ల తనకి వచ్చిన ప్రైజ్‌మనీ రూ. 50 లక్షలను మహిళా క్యాన్సర్ బాధితులకు విరాళంగా ప్రకటించాడు. దాంతో ఆహుతులు, ప్రేక్షకులు ఆయన్ను చప్పట్లతో అభినందించారు.
తన ప్రైజ్‌మనీ మరో తల్లి మరణాన్ని ఆపగలిగితే తనకు అదే చాలని ప్రకటించిన కౌశల్ పెద్దమనసును అంగీకరించాలి. ఎవరైనా అలాగే చేస్తారని ఎవరైనా వాదించవచ్చేమో గానీ కౌశల్ వంటి చిన్ననటునికి రూ.50లక్షలు అంటే పెద్దమొత్తమే. మరి ఈ విజయంతో కౌశల్ క్రేజ్ మునుపటికంటే చాలా పెరిగింది. మరి దానిని ఆయన తన కెరీర్ ఎదుగుదలకు ఎంత బాగా ఉపయోగించుకుంటాడో వేచిచూడాలి? ఎందుకంటే బిగ్‌బాస్ సీజన్1 విజేత మెగాభిమానులు, ముఖ్యంగా పవన్ అభిమానుల మెప్పు పొంది గెలిచినప్పటికీ దానిని తన కెరీర్‌కి తగ్గట్టుగా వినియోగించుకోవడంలో విఫలయ్యాడనే చెప్పాలి.