థమన్.. ఒకానొక దశలో తెలుగులో వేగంగా 50 చిత్రాల మార్కుని అందుకున్నాడు. గతకాలపు దర్శకుడు, నిర్మాత ఘంటసాల బలరామయ్య మనవడు అయినా కూడా సంగీత దర్శకునిగా తన సత్తా చాటుతున్నాడు. ఈయనది నెల్లూరు జిల్లాలోని పొట్టేపాళెం స్వగ్రామం. ఈయన తండ్రి ఘంటసాల శివకుమార్ సంగీత దర్శకుడైన స్వర్గీయ చక్రవర్తి వద్ద 700చిత్రాలకు పైగా డ్రమర్‌గా పనిచేశాడు. తల్లి ఘంటసాల సావిత్రి గాయని, అత్త పి.వసంత కూడా ప్రముఖ గాయనీమణి. ఇక థమన్ పూర్తి పేరు ఘంటసాల సాయిశ్రీనివాస్ థమన్ శివకుమార్. రిథమ్ ప్యాడ్స్, కీబోర్డ్ ప్లేయర్. సంగీత దర్శకునిగా, నటునిగా, బ్యాగ్రౌండ్ రికార్డ ర్ గా, నిర్మాత, గాయకునిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళ భాషల్లోనే కాదు.. బాలీవుడ్‌కి కూడా ఎంట్రీ ఇచ్చాడు. తన మొదటి చిత్రం 'కిక్'తో బ్లాక్‌బస్టర్ సాధించి రవితేజ సినిమాలకు ఆస్థాన సంగీత దర్శకుడు అయ్యాడు. ఇక ఈయన అతి తక్కువ సమయంలో స్టార్స్ అందరితో కలిసి పనిచేయడమే గాక, నటులను గాయకులుగా మార్చుతూ ఓ ట్రెండ్ సృష్టించాడు.
ఇక ఈయన నటించిన చిత్రాలలోని ఎన్నోపాటలు అద్భుతమైన స్పందనను రాబట్టినప్పటికీ ఈయన ఎక్కువగా కాపీ ట్యూన్స్ వాడుతాడనే అపప్రధ ఉంది. అయితే ఇటీవల విడుదలైన 'భాగమతి, తొలిప్రేమ' చిత్రాలతో తనలోని ప్రత్యేకతను చాటాడు. 'బృందావనం, రగడ, రేసుగుర్రం, బిజినెస్‌మేన్, మిరపకాయ్, దూకుడు, బిజినెస్‌మేన్, నాయక్, బాద్‌షా, సరైనోడు' వంటి చిత్రాలకు సంగీతం అందించి హిట్స్‌కొట్టినా ఈయనపై ఉన్న కాపీక్యాట్ అనే ముద్ర మాత్రం పోలేదు. ఇక సంగీత దర్శకులను ఎంతగానో ఉపయోగించుకునే త్రివిక్రమ్-ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో వస్తున్న 'అరవింద సమేత వీరరాఘవ'కి మొదటి సారి పనిచేస్తున్నాడు. ఈ పాటలకి ఆయన అందించిన ట్యూన్స్ ఆయన బాణీల నుంచే గతంలోని వాటిని తిరిగి కాపీ కొట్టాడనే విమర్శలు వస్తున్నాయి.
దీనిపై థమన్ స్పందిస్తూ, నా ట్యూన్స్‌నే నేను మరలా మరలా వాడుకుంటే తప్పెలా అవుతుంది. బాణీలు కట్టడంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. నా స్టైల్ నాది. కావాలని విమర్శలు చేసే వారిని పట్టించుకుంటూ నా సమయాన్ని, పనిని వృధా చేసుకోను. దర్శక నిర్మాతలు, హీరోలు నన్ను నమ్ముకున్నంత కాలం నేనెవ్వరినీ పట్టించుకోవాల్సిన పనిలేదు అని చెప్పుకొచ్చాడు. అయితే దేవిశ్రీ, కీరవాణి వంటి వారిని పోటీలో ఢీకొనాలంటే ఇలాంటి అసహనాలు మాటలు సరిపోవు. 'సైరా' చిత్రం విషయంలో మోషన్ పోస్టర్‌కి ఈయనే సంగీతం అందించినా, ఆ చాన్స్ ఆయనకు రాలేదంటే ఇలాంటి విమర్శలే కారణమని ఆయన తెలుసుకోవాలి..!