తెలుగులో కమెడియన్లు కూడా హీరోలుగా ఎదగవచ్చని, కేవలం హాస్యంతో చిత్రాలను బ్లాక్‌బస్టర్స్‌గా నిలపవచ్చని, కామెడీ చేసే వారికి కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుందని నిరూపించిన వారిలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ ముఖ్యుడు. స్వయంగా మేధావి, ఎన్నో భాషలు తెలిసిన పండితుడైన మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహారావుకి ఎన్నోభాషలు వచ్చినా తనకి ఏదైనా టెన్షన్ ఉంటే రాజేంద్రప్రసాద్ చిత్రాలు చూస్తూ నవ్వుకుని, రిలాక్స్ అవుతానని ఇచ్చిన కాంప్లిమెంట్ సామాన్యమైనది కాదు. కామెడీ హీరోలు స్టార్‌స్టేటస్ తేవడంలోనే కాదు.. పంచ్‌లు వేయడంలో కూడా రాజేంద్రునికి తనదైన టైమింగ్ ఉంటుంది. అలాగని ఈయన కేవలం కామెడీ హీరోనే కాదు. 'ఎర్రమందారం, పుణ్యస్త్రీ, ఆ.. నలుగురు, మీ శ్రేయోభిలాషి'లతో పాటు ఎన్నో రకాల చిత్రాలు చేశారు. 'మేడమ్' ద్వారా కమల్‌కి పోటీగా లేడీ గెటప్‌ని చేశాడనే పేరు తెచ్చుకున్నాడు.
ఈయన తర్వాత ఆ స్థాయిలో అల్లరినరేష్ మెప్పిస్తాడని భావించిన రాజేంద్రుడు ఏలినట్లుగా లాంగ్ పీరియడ్‌లో మొనాటనీ లేకుండా ఎవ్వరూ చేయలేరని అల్లరినరేష్, సునీల్ వంటి వారిని చూస్తే తెలిసిపోతుంది. ఇక ప్రస్తుతం రాజేంద్రుడు తండ్రి పాత్రలు, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కూడా మెప్పిస్తున్నాడు. ఇక ఈయన 'బేవర్స్' చిత్రంలో హీరోకి తండ్రి పాత్రను పోషిస్తున్నాడు.
ట్రైలర్ లోని 'తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు.. మా ఎదవ ముదిరి బేవార్స్' అయ్యాడు అనే ఆయన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో ఆయన తనదైన పంచ్‌లు వేస్తూ అందరినీ నవ్వించాడు. వేదికపై హీరోయిన్లు హీరో పక్కనే ఉండటం చూసి, హీరోయిన్లు తన పక్కన కూడా కూర్చోవచ్చని సరదాగా వ్యాఖ్యానించాడు. వేదికపై ఉన్న పంచ్‌లు వేసే ఆదిని ఉద్దేశించి చూసి కుళ్లుకోవద్దని అన్నాడు. దానికి ఆది ఏదో అనబోగా, 'నీముందు కంటే పంచ్‌లు వేసిన వాడినిరా బాబూ నేను.. ఆది అనేవాడు పుట్టకముందు నుంచే అల్లరి చేసిన వాడు రాజేంద్రప్రసాద్'అని ఆదికి పంచ్ ఇవ్వడం బాగా పేలింది.