ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో, వారి ఆవేదనలో అర్ధం ఉందని, ఎలాగూ విడిపోయాం కాబట్టి ఇకనైనా అన్నదమ్ములుగా కలిసి ఉందామని ఆంధ్రా ప్రజలు ఆశిస్తున్నారు అనేది వాస్తవం. నాటి తెలంగాణ వేడిలో రాష్ట్ర విభజన తప్పు అని సామాన్యులు భావించినా, అది కేవలం కొంత కాలం మాత్రమే. విడిపోయిన తర్వాత మన కష్టాలు మనం పడదామని ఆంధ్రులు భావిస్తున్నారు. అందుకే ఏపీలో కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు వంటి వారిని చూసి పాలన అంటే ఇలా ఉండాలి.. బాగా చేస్తున్నారు అని ఎందరో ఆంధ్రులు టీఆర్‌ఎస్ నాయకులకు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సారధులకు అభిమానులుగా మారారు. తెలంగాణ నాయకుల అలుపెరుగని పోరాటాన్ని, వారు ఎంతో గట్టి పట్టుదలతో తెలంగాణ సాధించుకున్న స్ఫూర్తిని తాము కూడా ప్రత్యేకహోదా విషయంలో కొనసాగించాలని భావిస్తున్నారు.
కానీ కేసీఆర్ మాత్రం ఇప్పటికీ ఆంధ్రా వారిని దోపిడీ దారులుగా చూడటం, రెచ్చగొట్టడం మానుకోవడం లేదు. ప్రత్యేకహోదా ఆంద్రుల హక్కు అని కవిత అన్నప్పుడు మన సోదరులైన తెలంగాణ వారు మాకు మద్దతు తెలిపారని ఏపీ ప్రజలు ఎంతో సంతోషించారు. కానీ ఆ సంతోషం మూడునాళ్ల ముచ్చటే అని తేలింది. బిజెపిపై అవిశ్వాసతీర్మానంలో ఏపీకి మద్దతు తెలపాల్సిన బాధ్యత ఉన్న కేసీఆర్ డబుల్ గేమ్ ఆడాడు.
ఇక ప్రస్తుతం కేసీఆర్ కేవలం తెలంగాణకు ఆపద్దర్మ ముఖ్యమంత్రి మాత్రమే. కానీ ఏపీకి చంద్రబాబు ఇంకా సీఎం. అంటే ఏపీ ప్రజల తరపున ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాయకుడు. అందుకే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంకా కొనసాగుతోన్నవ్యక్తిని ఎవరైనా అవమానిస్తే అది ఆ రాష్ట్ర ప్రజలందరినీ అవమానించినట్లే కారణం. చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడు అనేది పక్కనపెడితే ఆయన మాటలు మాత్రం ఎంతో హుందాగా ఉంటాయి. అందుకే ఆయన కేసీఆర్‌తో కలిసి జత కట్టి తెలుగువారిసత్తా ఢిల్లీకి చాటాలని ముందుగా భావించాడు. అందుకే ఎన్నికల్లో తన బద్దశత్రువైన కేసీఆర్‌తో కలిసి నడవాలనుకున్నాడు. కానీ ఢిల్లీలోని బిజెపి చెప్పినట్లుగా ఆడుతోన్న కేసీఆర్ మాత్రం ఓముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా ఇవ్వకుండా ఎన్నికల్లో ఓట్ల కోసం దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నాడని నేడు ఏపీ ప్రజలు భావిస్తున్నారు.
ఇక తాజాగా చంద్రబాబుని కేసీఆర్ నీచంగా మాట్లాడారు. తమ దెబ్బకి విజయవాడ కరకట్టకు ఎగిరిపడిన చంద్రబాబు పరిస్థితి ఏపీలో అగమ్యగోచరంగా ఉందని వ్యాఖ్యానించాడు. మళ్లీ తెలంగాణలో దుకాణం పెట్టాలని అనుకుంటున్నావా బిడ్డా? నేను మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో ఆలోచించుకోమని మనవి చేస్తున్నాను. తెలంగాణకు మరలా నువ్వు కావాలా? టిడిపితో పొత్తు పెట్టుకుంటామని కాంగ్రెస్ వారు వెళ్తున్నారు. చావు నోట్లో తలపెట్టి సాధించుకున్న తెలంగాణని మరలా తీసుకుపోయి విజయవాడకు అప్పజెబుతారా? రేపు దరఖాస్తులు పట్టుకుని మనం అమరావతి పోవాలా? హైదరాబాద్ పోవాలా? 58ఏళ్ల పీడ ఎన్నో పోరాటాలు చేసి వదిలించుకుంటే ఈరోజున దుర్మార్గులు నిస్సిగ్గుగా.. పౌరుషం లేకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంట కలుపుతున్నారు.. ఒక్కసారి ఊహించండి..ఈ దుర్మార్గులు అధికారంలోకి వచ్చి చంద్రబాబు 15సీట్లు గెలిస్తే మనకు సాగర్ నీరు రానిస్తాడా? కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టనిస్తాడా? అంటూ ఘోరంగా మాట్లాడాడు.
ఏ పార్టీకి ఎక్కడ నుంచైనా పోటీ చేసే హక్కుఉందని, కొందరు టీఆర్‌ఎస్‌ని కూడా ఏపీలో పోటీకి నిలపాలని ఆహ్వానిస్తున్నారు. అలాంటి వారికి విరుద్దంగా ఓట్ల కోసం మరలా ప్రజల్లో ద్వేషభావాలు రగిలించడం ఎంతవరకు సమంజసం? కేసీఆర్ తెరుస్తానంటున్న మూడోకన్ను మోదీనా? అనే అనుమానాలు రాకమానవు.