దేశంలో ఇప్పటివరకు బడా బడా రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, పెద్దల అండదండలు ఉన్న వారు ఎన్నో కుంభకోణాలకు పాల్పడ్డారు. కానీ వాటిల్లో ఏదైనా నిరూపితం అయి పెద్దలకు శిక్షలు పడ్డాయా? అంటే అనుమానమే. అప్పుడప్పులు లల్లూప్రసాద్‌యాదవ్, జయలలిత, శశికళ వంటి వారు నేరస్థులుగా తేలినా వాటిని నిరూపించే సమయానికి జయ మరణించినట్లుగా పుణ్యకాలం గడిచిపోతోంది. చట్టాలు కూడా బలవంతులకు బలహీనంగా.. బలహీనుల పట్ల బలంగా పనిచేస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు తప్పుడు తీర్పుల వల్ల తప్పు చేయని వారు కూడా అమూల్యమైన జీవితాలను కోల్పోతూ ఉంటారు. ఉదాహరణకు ఆయేషా కేసు శిక్ష అనుభవించిన అమాయకుడిని ఉదాహరణగా చెప్పవచ్చు. స్వయానా ఆయేషా తల్లే అతను నేరస్థుడు కాదని, నేరస్థుడి పేరు చెప్పినా చట్టం చేతుల్లో అమాయకుడు బలయ్యాడు. కాబట్టే నేడు బడా బడా పలుకుబడి ఉన్నవారంతా ఏ ఆరోపణ వచ్చినా న్యాయస్థానంలో తేల్చుకుందామని చెబుతూ తమని తాము కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక ప్రముఖ తమిళ సాహిత్యవేత్త, తమిళ సినీ గేయ రచయిత వైరముత్తుపై సింగర్ చిన్మయి శ్రీపాద తీవ్ర లైంగిక ఆరోపణలు చేసింది. తనని మైనర్‌గా ఉన్నప్పుడే లైంగికంగా వేధించాడని, మరో వ్యక్తి ద్వారా తనని గదిలోకి ఒంటరిగా రమ్మన్నాడని తెలిపింది. తనతో పాటు పలువురిని ఆయన లైంగికంగా వేధించాడని, వారికి తప్పుడు మెసేజ్‌లు పెట్టాడని ఆరోపిస్తూ, దానికి పలు మెసేజ్‌లను స్క్రీన్‌షాట్స్ తీసి ట్విట్టర్లో షేర్ చేసింది. తాజాగా ఆమె వైరముత్తుకి లై డిటెక్టర్ పరీక్షలు చేయాలని కోరింది. దీనిపై ఓ నెటిజన్ ఆయన కంటే ముందుగా నీకే లై డిటెక్టర్ పరీక్షలు చేయాలని వెటకారంగా అనడంతో ఆమె లైడిటెక్టర్ పరీక్షలకు నేను సిద్దం. మరి వైరముత్తు సిద్దమా? అని సవాల్ విసిరింది. తాజాగా దీనిపై స్పందిస్తూ వైరముత్తు ఓ వీడియో విడుదల చేశాడు.
ఇందులో ఆయన మాట్లాడుతూ.. నాపై వస్తున్న ఆరోపణలన్నీ అబద్దాలే. అవి నిజమైతే.. ఆ మహిళ నాపై చట్టప్రకారం కేసు పెట్టవచ్చు. చట్టపరంగా దీనిని ఎదుర్కోవడానికి నేను సిద్దంగా ఉన్నాను. నేను మంచివాడినో, చెడ్డవాడినో మరొకరు చెప్పనక్కరలేదు. న్యాయస్థానమే దానిని నిర్ణయిస్తుంది. కోర్టు తీర్పుకి నేను కట్టుబడి ఉంటాను.. అని చెప్పుకొచ్చాడు తప్ప లై డిటెక్టర్ పరీక్షలపై మాత్రం స్పందించలేదు. ఇక వైరముత్తు వ్యవహారంపై, ‘మీటూ’ ఉద్యమంపై కమల్‌హాసన్ స్పందించిన విషయం తెలిసిందే. ఆయన మాట్లాడుతూ, బాధితురాళ్లే ముందుకు వచ్చి మాట్లాడాలి. ఆమె తరపున మరొకరు వకాల్తా పుచ్చుకుని మాట్లాడకూడదు. ‘మీటూ’ ఉద్యమం న్యాయబద్దంగా జరిగితే దానికి నేను మద్దతు ఇస్తాను. ‘మీటూ’ ఉద్యమంలో అవాస్తవాలు కూడా ఉండవచ్చు.. అంటూ తన అభిప్రాయం చెప్పిన సంగతి విదితమే.