ఈమధ్య ఏ సినిమా చూసినా ఎవరో ఒకరి మనోభావాలు దెబ్బతింటూనే ఉంటున్నాయి. ఏ సీన్‌కి, ఏ సంభాషణకి, ఏ కథకి, ఏ టైటిల్‌కి ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో కూడా అర్ధం కాని పరిస్థితి నెలకొంది. కొంత మంది దర్శకులు తీసే దానిలో తప్పు ఉండవచ్చు. కానీ వెంటనే మనోభావాల పేరిట అందరి తరపున ఎవరో ఒకరు వచ్చి మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది. ‘పద్మావత్’ చిత్రంపై జరిగిన రగడ అందరికీ తెలిసిందే. కానీ ఆ చిత్రం చూసి రాజ్‌పుత్ మహిళలు థియేటర్లలో డ్యాన్సులు చేసి, హారతులు పట్టారు.
ఇక విషయానికి వస్తే సినిమా అనేది శక్తివంతమైన మాధ్యమం. అలాగని దర్శకుల క్రియేటివిటీని హరించే శక్తి, వారిని నియంత్రించే శక్తి ఎవరి చేతుల్లో పడితే వారు తీసుకుంటే అది చివరకు ఎవరు ఏమి తీయాలనుకున్నా తీయలేని పరిస్థితులు ఎదురవుతాయి. సెన్సార్‌కి ఇక అర్ధం పర్ధం ఉండదు. సెన్సార్ సర్టిఫికేట్ అనేది ఓ చెల్లని కాగితం అయిపోతుంది. ఇక విషయానికి వస్తే గతంలో సీమ ఫ్యాక్షన్‌ని చూపించి, ఎంతో క్రూరులుగా వారిని చిత్రించిన చిత్రాలెన్నో వచ్చాయి. అయితే అలాంటివి బాగా రొటీన్ అయిపోవడంతో వాటి ట్రెండ్ ఆగిపోయింది. కానీ మరలా ఇంత కాలానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్‌తో తీసిన ‘అరవిందసమేత వీరరాఘవ’ ద్వారా మరో ఫ్యాక్షన్ చిత్రం తీశాడు. కానీ మిగిలిన ఫ్యాక్షన్ చిత్రాలకంటే ఇది విభిన్నమైనదనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో చూపించినంత నిజాయితీ, అచ్చమైన రాయలసీమ పద్దతులు, ఎంతో సహజాతిసహజంగా రూపొందిన చిత్రం గతంలో రాలేదు.
మరోవైపు ఇప్పటికే ఈ మూవీ పలు వివాదాలకు కారణమవుతోంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపధ్యంలో కథలు, ఆ యాసలో రచనలు చేసి కేంద్ర సాహిత్య అకాడమి యువపురస్కారం అందుకున్న వేంపల్లి గంగాధర్ తన మొండి కత్తిని పాపాఘ్నిని ఇందులో కాపీ కొట్టారని ఆరోపిస్తున్నారు. మరి వేంపల్లి గంగాధర్ రచనల్లో లేని అభ్యంతరం అదే పాయింట్ మీద త్రివిక్రమ్ చిత్రంగా తీస్తే దానిపై ఎందుకు వస్తోందనేది ఆలోచించాల్సిన విషయం. సినిమా అనేది అభూత కల్పన. కాల్పనికతకు వాస్తవరూపం ఇచ్చి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ ఆలోచింపజేయడమే సినిమా లక్ష్యం. అంతేగానీ ఇందులో విలన్‌ని మా ప్రాంతపు వాడుగా చూపించి చెడ్డగా చిత్రీకరించారు? హీరోని ఫలానా ప్రాంతం వాడిగా చూపి ఉన్నతుడి చూపించారు? ఫలానా భాషని,యాసని వాడుకున్నారు? ఫలానా వ్యక్తి చేత సిగరెట్లు, మద్యం తాగినట్లు చూపించారు? అని ప్రతి విషయానికి ఏదో గుడ్డుపై ఈకలు పీకితే సినిమా అనేది తీయడమే అసంభవం.
కథ, పాత్రలు, విలన్, హీరో అన్న తర్వాత వారిని ఏదో విధంగా, ఏదో ప్రాంతపు, ఏదో భాషా వ్యక్తిగా చూపించాల్సిందే. అంతేగానీ ప్రతి దానికి ఏదో అర్ధం తీసుకోకూడదు. ఇక ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రంపై రాయలసీమ ప్రాంత సాహిత్యవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా సీమ వాసుల ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో ఫ్యాక్షన్ నేపధ్యంలో వచ్చిన చిత్రాలు తమ ప్రాంతాన్ని చెడుగా చూపించి సొమ్ము చేసుకున్నాయని, ఆ తర్వాత ఆ తరహా చిత్రాలు ఆగిపోయాయని, మరలా ఇంత కాలానికి మరోసారి త్రివిక్రమ్ అలాంటి సినిమానే తీసి సీమను చెడుగా చూపించారని గళమెత్తుతున్నారు.
అటు తెలంగాణ మాండలికం, ఇటు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, నెల్లూరు, రాయలసీమ.. ఇలా ఏ భాషని వాడకపోతే అసలు సినిమాకి నిండుతనం ఏముంటుంది? చెప్పాలనుకున్న విషయాన్ని అందులోని నీతిని వదిలేసి ఇలా ప్రతి దానికి నానా అర్ధాలు తీస్తే ఎలా? అనే అనుమానం రాకమానదు. ఇక తాజాగా రాయలసీమ విద్యార్ది, ప్రజాసంఘాలు మరో అడుగు ముందుకేసి హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టాయి. ఇందులో ఎన్నో అభ్యంతరకమైన సీన్స్ ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
రాయలసీమకు చెందిన పలు అభ్యంతరాలు, డైలాగ్‌లు ఇందులో ఉన్నాయి. ఇలాంటి సినిమా తీసినందుకు త్రివిక్రమ్ రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఫ్యాక్షన్ సీన్స్ యువతను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. ఇప్పటికైనా సినిమాలోని అలాంటి వాటిని తొలగించాలి. లేదంటే రాయలసీమలో ఈ చిత్రాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. వారు చెప్పినట్లు అన్ని తీసివేస్తే చివరకు టైటిల్ కార్డ్స్, శుభం కార్డు తప్పితే సినిమాలో ఏమీ చూపించలేమనేది వాస్తవం.