ఆపరేషన్ గరుడ అని శివాజీ చెప్పినప్పుడు అందరు అతను ఓ బఫూన్ అని భావించారు. కానీ చంద్రబాబుపై కేంద్రం అనుసరిస్తున్న తీరు, ప్రధాన ప్రతిపక్ష నేత జగన్‌పై ప్రాణాపాయం లేకుండా దాడితో పాటు ఏపీ రాష్ట్రానికి చెందని వ్యక్తులు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తారని ఆయన చెప్పాడు. కేసీఆర్, కేటీఆర్‌ల విమర్శలు చూస్తే అదే నిజమని అర్ధం అవుతోంది. ఏపీకి చెందిన ఓ మత ప్రచారకుడు, ఓ ఐపీఎస్.. ఇలా పలువురు బిజెపి గూటికి చేరుతారని కూడా శివాజీ చెప్పాడు. అనుకున్నట్లే పరిపూర్ణానంద నుంచి జెడీలక్ష్మీనారాయణ వరకు కాషాయం అందుకుంటున్నారు. ఇక మూడోది మరో మూడు నెలలలోపు చంద్రబాబుని అధికారం నుంచి తప్పిస్తారని కూడా ఆపరేషన్ గరుడలో భాగంగా చెప్పిన శివాజీ మూడో మాట కూడా నిజం అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి.
ఇక తాజాగా వైసీపీ నేత, ఫైర్‌బ్రాండ్‌గా పేరుబడ్డ రోజా ప్రత్యేకహోదా సాధన కమిటీ నేత శివాజీపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనికి శివాజీ కూడా అంతే ఘాటుగా సమాధానం ఇచ్చాడు. రోజా తానో ఫైర్‌బ్రాండ్ అనే గొప్పతో నీచాతినీచమైన, మహిళలు వినడానికే సిగ్గుపడే భాషని ఉపయోగిస్తే అదే గొప్ప అనుకుంటోంది. కానీ ఇంత కాలం ఆమెకి సరైన వ్యక్తి తారసపడలేదు. కానీ శివాజీ ఆమె బాకీని తీర్చేశాడనే చెప్పాలి. తనపై రోజా ఉపయోగించిన భాష చాలా దారుణంగా ఉందని మండిపడ్డ శివాజీ ఆమెకి సమాధానం ఇస్తూ, అవసరమైతే ఆమెపై పరువు నష్టందావా వేస్తానని, అయితే ఇప్పటికీ తాను ఆమెని గౌరవిస్తున్నానని అన్నాడు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. నేను మాట్లాడాలనుకుంటే రోజా కంటే నీచమైన భాషలో మాట్లాడగలను. నేను పల్నాడు ప్రాంతానికి చెందిన వాడిని. బూతుల్లో పిహెచ్‌డీ ఉంటుంది అంటే అది పల్నాడుకే చెందుతుందని ఆమె గుర్తుంచుకోవాలి. రోజమ్మా... దయచేసి నా జోలికి రావద్దు. నా వ్యక్తిగత విషయం గురించి విమర్శిస్తే.. ఖచ్చితంగా పరువు నష్టం నోటీసుల పంపిస్తా.. రాష్ట్రంలో జరగబోయే భయంకరమైన పరిణామాల గురించి నేను ‘ఆపరేషన్ గరుడ’ ద్వారా వీడియోలో వెల్లడించాను. అందులో నేను, వైసీపీ, బిజెపి, జనసేన వంటి పార్టీ పేర్లను ఎక్కడా ఉచ్చరించలేదు. నా వీడియోను చూసి ఈ పార్టీల నాయకులంతా ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో అర్ధం కావడం లేదు. నన్ను విచారించి మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టాలని బిజెపి, వైసీపీ నేతలు అంటున్నారు.
20 నిమిషాల ఈ వీడియోలో అన్ని విషయాలను నేను వివరంగా చెప్పాను. ఇంకా ఏమి సమాచారం మీకు కావాలి? విచారణ సంస్థలన్నీ కేంద్రపరిధిలోనే ఉన్నాయి. నాపై విచారణ జరుపుకోవచ్చు. నన్ను అరెస్ట్ చేసినా అభ్యంతరం చెప్పను. ఒక వేళ నన్ను కస్టడీలోకి తీసుకుంటే.. మూడు నెలల్లో చంద్రబాబుని పదవి నుంచి దింపేస్తామని అన్న బిజెపి నేత జీవీఎల్‌ని కూడా కస్టడీలోకి తీసుకోవాలి.. అంటూ శివాజీ మరోసారి ఆయా పార్టీలపై విరుచుకుపడ్డాడు.