జనసేనాని పవన్‌కళ్యాణ్ తన పార్టీకి సంబంధించిన ఓ ప్రత్యేక విషయాన్ని బాగా నిర్లక్ష్యం చేస్తున్నాడా? అంటే పలువురి నుంచి అవును అనే సమాధానం వస్తుంది. గతంలో స్వర్గీయ ఎన్టీఆర్ టిడిపి పార్టీని స్థాపించి, అతి తక్కువ వ్యవధిలో అధికారం చేపట్టి రికార్డు సృష్టించాడు. అదే తరహాలో చిరంజీవి కూడా ఎప్పటినుంచో రాజకీయాలలోకి రావాలనే ప్లాన్ ఉన్నప్పటికీ ఎన్టీఆర్ కంటే తక్కువ వ్యవధిలో అధికారం దక్కించుకున్న రికార్డుపై దృష్టి సారించి దెబ్బతిన్నాడు. నాటి ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి పరిస్థితులు పూర్తిగా వేరు. నాడు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు ఇప్పుడున్నంత ఉదృతంగా లేనప్పటికీ, సోషల్‌మీడియా అంటేనే తెలియని రోజుల్లో కూడా తన పార్టీ గుర్తును ఆయన అత్యంత చాకచక్యంగా ప్రజల మనసుల్లోకి తీసుకెళ్లాడు.
కానీ ప్రజారాజ్యం పార్టీ విషయంలో చివరి నిమిషం వరకు పార్టీ గుర్తురాకపోవడంతో చిరు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఇక వైసీపీ నేడు బలంగా దూసుకెళ్తోంది. కానీ గతంలో ఆ పార్టీకి ఫ్యాన్ గుర్తు ఇంకా ఈసీ కేటాయింకముందే ఫ్యాన్ గుర్తుతో ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ముందుగానే ప్రారంభించడం ఎన్నో విమర్శలకు తావిచ్చింది. కానీ ఎట్టకేలకు అదే గుర్తు వైసీపీకి లభించింది. ఇక తాజాగా తెలంగాణలో ప్రొఫెసర్ కోదండరామ్ అధ్యక్షునిగా స్థాపించిన తెలంగాణ జనసమితి కూడా ఇదే ఎన్నికల గుర్తు విషయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. 2018 మార్చి31న తెలంగాణ జనసమితి (టీజెఎస్) స్థాపితం అయింది. ఏప్రిల్ 29న తొలి సభను కూడా నిర్వహించింది. తాజాగా ఈ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తుగా ‘అగ్గిపెట్టె’ను కేటాయించింది. టీజెఎస్‌తో పాటు మొత్తం 15 పార్టీలకు కొత్తగా ఈసీ ఎన్నికల గుర్తును కేటాయించింది. దీనిలో జనసేన పేరు కూడా ఉండి ఉంటుందని పలువురు భావించారు.
అయితే 2013లో పార్టీని స్థాపించిన పవన్ జనసేనకు ఇంకా ఈసీ ఎన్నికల గుర్తు కేటాయించలేదు. జనసేనని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం రిజిష్టర్డ్ పార్టీగా గుర్తించింది. అయితే పార్టీ గుర్తు కేటాయింపు ఎక్కడి వరకు వచ్చిందో సమాచారం మాత్రం లేదు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయని కారణంగా దీని వల్ల పవన్‌కి ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం ఏమీ లేనప్పటికీ ఆయన పార్టీ గుర్తు విషయంలో ఎందుకు ఇంత ఉదాసీనత వహిస్తున్నాడో అర్ధం కాని పరిస్థితి. తొందర ఏమీ లేనప్పటికీ కొత్త పార్టీకి ఎంత ముందుగా ఎన్నికల గుర్తు లభిస్తే అంత త్వరగా అంతకంటే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వీలుంటుంది. ఏ పార్టీకైనా ఎన్నికల గుర్తును ప్రజల మదిలో బలంగా ముద్రించేందుకు కొంత సమయం ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి గుర్తు ఎంత త్వరగా తెలిస్తే అంత మంచిది. జనసేన నాయకులు ఆ దిశగా ఎందుకు ఇంకా ప్రయత్నాలు మొదలపెట్టడం లేదనే విషయం అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరాం కూడా ఒకటిన్నర నెలల్లో పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే తప్పు పవన్ కూడా పునరావృతం చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. మరోవైపు జనసేన ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిని మాత్రమే ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణకు మాత్రమే సీటు ఖరారు చేసినట్లు పవన్ ప్రకటించాడు. పవన్ కళ్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్ వంటి వారు కూడా ఇంకా ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారో అర్ధం కాని పరిస్థితి. గతంలో పవన్ తాను అనంతపురం జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తెలిపాడు. అదేసమయంలో ఆయన రెండో చోట అంటే ఉభయగోదావరి జిల్లాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ పడటం నామమాత్రమే అని తెలుస్తున్నా.. అవి ఏయే స్థానాల నుంచి అన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదంటున్నారు.