నేడు మీడియా నుంచి ప్రతి ఒక్కరు చేస్తోన్న పని ఒకటే. అదేమిటంటే.. తమకు ఎవరిపై కక్ష్యగా ఉంటుందో వారిపై కొన్ని ఆరోపణలు చేసి పారేస్తాం. ఆ తర్వాత అవి నిజమా? కాదా? అనేది తేలేందుకు ఎంతో సమయం పడుతుంది. అంతలోపు ఆయా వ్యక్తుల ఇమేజ్ పూర్తిగా దెబ్బతింటుంది. విమర్శలు చేసిన వారిని సాక్ష్యాధారాలు అడిగితే మీకు చెప్పాల్సిన అవసరం లేదంటారు. విమర్శలకు గురయిన వ్యక్తి అవునో కాదో స్పందించాలంటారు. మౌనంగా ఉంటే ఆయన తప్పు ఒప్పుకున్నాడంటారు. కాదని ఖండిస్తూ నిజం త్వరలో తెలుస్తుందంటారు. మరి ఇలాంటివి నిజమో కాదో తర్వాత తెలుస్తుంది. అంతలోపు అసలు వ్యక్తులకు బాగా డ్యామేజ్ కలుగుతుంది. ఇప్పుడు బహుశా అర్జున్సజ్రా అదే పరిస్థితి ఎదుర్కొంటున్నాడేమో అనే అనుమానం రాకమానదు. ఆయన తనని ఓ షూటింగ్ సందర్భంగా వేధించాడని శృతిహరిహరన్ అనే నటి ఫిర్యాదు చేసింది. అదే తడవుగా పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి కేసు కూడా పెట్టింది.
దీంతో అర్జున్ తరపు న్యాయవాది హైకోర్టులో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని రద్దు చేయాలని పిటిషన్ వేశాడు. ఆమె చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని, వాటికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని ఆయన ఈ సందర్భంగా హైకోర్టుకి తెలిపాడు. అర్జున్ తరపు న్యాయవాది ఆయన 37ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నారని, 150కి పైగా చిత్రాలలో నటించాడని తెలిపారు. అర్జున్ హనుమాన్ భక్తుడని, ఆయన చెన్నైలో 32 అడుగుల పొడవు. 17 అడుగుల వెడల్పు ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని కూడా స్థాపించాడని, ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండే అర్జున్‌పై ఇలాంటి సాక్ష్యాధారాలు లేని విమర్శలు చేయడం దారుణమని కోర్టుకి తెలిపాడు. ఇంకా తన వాదనలను వినిపించేందుకు కొంత సమయం కావాలని అర్జున్ తరపు న్యాయవాది కోరడంతో కోర్టు ఈ రోజుకి కేసును వాయిదా వేసింది.
శృతి తరపు న్యాయవాది మాత్రం ఈ కేసు విచారణను పోలీసులు కావాలని చాలా నెమ్మదిగా సాగిస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు. కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని, కావాలనే పోలీసులు నెమ్మదిగా విచారణ చేస్తూ కోర్టును తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన కోరారు. మొత్తానికి ఈ విషయంలో దోషులు ఎవరో, నిజమైన నిందితులు ఎవరో తేలే సమయానికి అర్జున్‌పై జరుగుతున్న దుష్ప్రభావం ఆయన కుటుంబీకులను, అభిమానులను బాధకి గురిచేస్తూ ఉండటం మాత్రం నిజం.