తమిళస్టార్ అయిన శరత్‌కుమార్ తెలుగులో విలన్‌గా, హీరోగా, పలు విభిన్నమైన సపోర్టింగ్, కీరోల్స్ చేశాడు. ఇక తమిళంలో ఆయన ఓ నాడు ఓ ఊపు ఊపాడు. నాడు ఆయనకు బలమైన పోటీగా ఉన్న విజయ్‌కాంత్‌ని సైతం ఢీకొని తన సత్తా చాటాడు. ఇక లారెన్స్ నటించి, దర్శకత్వం వహించిన ‘కాంచన’ చిత్రంలో హిజ్రా పాత్రకి ఎనలేని పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆయనలోని నటనావిశ్వరూపాన్ని ఆ చిత్రంలోని పాత్ర నిరూపిస్తోంది. తన భర్త నటించిన ఏ చిత్రంలోని పాత్రను చూసి తాను ఇంతలా ఆకర్షితురాలిని కాలేదని, కానీ ‘కాంచన’ చిత్రంలో మాత్రం తన భర్త నటనను చూసి మాత్రం తాను ఎంతో గర్వించానని స్వయంగా విలక్షణ నటి, ఏ పాత్రలో నైనా ఒదిగిపోయే రాధిక సైతం ప్రశంసలు కురిపించింది. ఇక శరత్‌కుమార్ నటనావారసత్వాన్ని ఆయన కుమార్తె వరలక్ష్మి శరత్‌కుమార్ పుణికిపుచ్చుకుంది.
ఆమె నటించిన ప్రతి చిత్రంలో ఆమె కాక, అందులోని పాత్రే కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. కేవలం పాతిక లోపు చిత్రాలతోనే తనలోని ప్రతిభను నిరూపించుకున్న ఆమె విశాల్ నటించిన ‘పందెంకోడి2’ లో ప్రతినాయక ఛాయలున్న పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులను సైతం తన మొదటి చిత్రంలోనే ఆకట్టుకుంది. ఈ చిత్రం వచ్చిన అతి తక్కువ వ్యవధిలోనే ఆమె విజయ్-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక హాట్రిక్ చిత్రం ‘సర్కార్’తో పలకరించనుంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సర్కార్’ చిత్రంలోని నేను పోషించిన పాత్ర ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈ పాత్ర అంత వైవిధ్యమైనది. మొదటి నుంచి కొత్తదనానికి ప్రాధాన్యత ఇవ్వడమే నాకు అలవాటు. నేను హీరోయిన్‌గా మాత్రమే చేయాలని ఎప్పుడు గిరిగీసుకోలేదు. నేను చేసే పాత్ర కొత్తగా ఉండాలి. తెరపై నేను కాకుండా నా పాత్ర మాత్రమే కనిపించాలని కోరుకుంటాను. అందువల్లే నేను ఒక్క తమిళంలోనే ఇన్ని విభిన్నమైన పాత్రలు చేయగలిగాను.
సుదీర్ఘకాలం పాటు హీరోయిన్‌గా కొనసాగుతూ, ఒకే తరహా పాత్రలు చేయడమనేది నాకు ఇష్టం ఉండదు. అలాంటివి నాకు సంతృప్తిని కూడా ఇవ్వవు. అందుకే నా కెరీర్‌ని స్లోగా అయినా సరే స్టడీగా ఉంచుకుంటున్నాను. ‘సర్కార్’ చిత్రంతో నాకు తెలుగులో కూడా మరింత గుర్తింపు వస్తుంది.. అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది.