తెలుగులో విజయ్-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘సర్కార్’ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. సినిమా అనుకున్న స్థాయిలో లేదని కొందరు పెదవి విరుస్తున్నారు. అయినా ఈ మూవీకి తమిళనాడులో మాత్రం భారీ కలెక్షన్లు వస్తున్నాయి. కోలీవుడ్‌లో విజయ్ స్టామినా, మురుగదాస్‌కి ఉన్న ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. రజనీకాంత్ తర్వాత అక్కడ విజయ్, అజిత్‌లు నువ్వా? నేనా? అన్నట్లుగా పోటీ పడుతూ ఉంటారు. ‘మెర్సల్’ చిత్రంతో ఇప్పటికే విజయ్ ఒక సంచలనం సృష్టించాడు.
ఇక ఇప్పుడు ‘సర్కార్’ వంతు వచ్చింది. అదే సమయంలో కొత్త హీరోలు, శింబు వంటి వారు గతంలో రజనీకాంత్‌లా స్టైల్‌గా కనిపించాలని, ఆయన స్టైల్ ఆఫ్ యాక్టింగ్‌ని బాగా ఫాలో అయ్యేవారు. ఇప్పుడు ఏకంగా విజయ్ రజనీని అనుకరించడం, త్వరలో రజనీ రాజకీయాలలోకి వెళ్తూ ఉండటంతో ఆ స్థానం తనదేనని దీని ద్వారా విజయ్ చెప్పకనే చెప్పాడనే విషయం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలోని ఓ సీన్‌లో విజయ్ రజనీ తరహాలో చూయింగ్ గమ్‌ని స్టైల్‌గా నోట్లో వేసుకునే సీన్ రజనీని తలపిస్తోంది.
అదే సమయంలో విజయ్ తెలుగులో కూడా తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని భావిస్తున్నాడు. అందుకే ‘సర్కార్’ చిత్రంలో ఆయన పవన్‌కళ్యాణ్‌ని అనుకరిస్తూ కూడా నటించడం టాలీవుడ్‌లో కూడా పలు చర్చలకు దారి తీస్తోంది. రజనీ, పవన్‌లకి సరితూగే ఓ స్టార్ స్వయంగా వీరిని అనుకరించడం వెనుక ఏదైనా మతలబు ఉందా? అనే దిశగా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.