ఎవరు ఎందులో ప్రవీణులో అందులో మాత్రమే అణుకువగా ఉండాలి. లేదంటే బాలీవుడ్ భామ రాఖీసావంత్‌లా కష్టాలు కొని తెచ్చుకోక తప్పదు. ఇటీవల ‘మీ టూ’పై జరుగుతున్న హాట్ హాట్ చర్చల్లో తను కూడా ఓ మాటతో హాట్ టాపిక్‌గా నిలిచిన రాఖీసావంత్.. అసలు ‘మీ టూ’ ఉద్యమమే పనికిమాలిని ఉద్యమంగా కొట్టి పడేసింది. తనుశ్రీదత్తా తనను పాడుచేయబోయిందని చెబుతూ.. ఆమెపై 25 పైసల పరువు నష్టం కేసు వేసి ఆమె చేసిన వ్యాఖ్యలు.. అందరినీ ఔరా అనిపించాయంటే నమ్మాలిమరి.
ఇక విషయంలోకి వస్తే.. ‘మీ టూ’ వ్యాఖ్యల తర్వాత మరోసారి ఈ భామ వార్తల్లో నిలిచింది. హరియాణాలోని పంచకులలో జరిగిన కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్(సీడబ్ల్యూఈ) పోటీ సందర్భంగా జరిగిన ఘటనతో ఆమె నడుం విరక్కొట్టుకుని వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు విషయంలోకి వస్తే.. ఈ పోటీలో పాల్గొనే రెజ్లర్‌తో రాఖీ సావంత్ పోటీకి దిగింది. నేను నీతో పోటీకి దిగుతాను.. నువ్వు నాతో పాటు డ్యాన్స్ చేయాలని రెజ్లర్‌కు సవాల్ విసిరింది రాఖీ. ముందుగా డ్యాన్స్ పోటీని పూర్తి చేసిన రెజ్లర్.. ఆ తర్వాత తనతో పోటీకి దిగిన రాఖీని ఒకే ఒక్క షాట్‌తో నిలువునా పైకి ఎత్తి.. గట్టిగా నేలకేసి కొట్టింది. అంతే రాఖీ పని అయిపోయింది.
రెజ్లర్ కొట్టిన షాట్‌కు రింగ్‌లో నుంచి బయటికి రాలేక విలవిల లాడిపోయింది రాఖీ. ముందు ఆమె మాములుగా పడుకుందని అనుకున్న నిర్వహకులు.. తర్వాత ఆమె బాధను గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.