నిన్న శనివారం విడుదలైన టాక్సీవాలా సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది అనంతపురం పిల్ల ప్రియాంక జవాల్కర్. చాలా ఒడిదుడుకులు మధ్యన నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైన టాక్సీవాలా సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. హర్రర్ థ్రిల్లర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీనే హైలెట్ అనేలా ఉందంటున్నారు టాక్సీవాలా సినిమా చూసిన ప్రేక్షకులు. నోటాతో ప్లాప్ అందుకున్న విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే సహజమైన నటనతో ఆకట్టుకోగా.. రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ స్కిల్స్, స్క్రీన్ ప్లే, నేపధ్య సంగీతం, ఎంగేజింగ్ స్టోరీ, కనువిందైన విజువల్స్ అన్ని ఈ సినిమాకి కలిసిరావడం ఒక ఎత్తు అయితే... ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా పేక్షకులు థియేటర్ కి రావడం మరో ఎత్తు. ఎందుకంటే టాక్సీవాలా షూటింగ్ పూర్తయ్యి విడుదలకు సరైన డేట్ చిక్కక, వేరే సమస్యలతో సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతూ వచ్చింది. అలాగే మధ్యలో సినిమా మొత్తం యు ట్యూబ్ లో లీకవడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు లేవు. అందుకే ప్రేక్షకుడు ఫ్రెష్ మైండ్ తో సినిమాకొచ్చి బయటికొచ్చేటప్పుడు మంచి ఫీలింగ్ తో ఉన్నారు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఓ అన్నంత ప్రాధాన్యత లేకపోయినా ప్రియాంక జవాల్కర్ ఉన్నంతలో మెప్పించింది. ప్రియాంక జవాల్కర్ పాత్ర నిడివి చిన్నదే అయినా ఆమె నటన బాగుంది. చూడ్డానికి క్యూట్ గా ఉంది. నటన పరంగా ఆమె రుజువు చూసుకునేంత స్కోప్ ఈ క్యారెక్టర్ అయితే ఇవ్వలేదు. ఇక సినిమా సెకండ్ హాఫ్ లో ప్రియాంకకి అస్సలు అవకాశం లేకపోయింది. మరి మొదటి సినిమాకే ఎటువంటి తడబాటు లేకుండా ఉంది ప్రియాంక నటన. ఇక గ్లామరస్ గాను ప్రియాంక ఆకట్టుకుంది. మరి ఈ సినిమాతో మిగతా హీరోల చూపు ప్రియాంక మీద పడే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ప్రియాంక నటన ఎలా ఉన్నా హిట్ సినిమాలో ఆమె నటించింది కాబట్టి ఆమెకి అవకాశాలు వచ్చినా వస్తాయి.