కొత్త తరం మరియు ప్రముఖ నటీ నటులతో శ్రీ రంజిత్ మూవీస్ నూతన చిత్రం- నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్
కొత్త తరం మరియు ప్రముఖ నటీ నటులతో శ్రీ రంజిత్ మూవీస్ నూతన చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. శ్రీ రంజిత్ మూవీస్ ... ఈ బ్యానర్ పేరు వినగానే ‘అలా మొదలైంది’, ‘అంతకుముందు...ఆ తరువాత’, ‘కళ్యాణ వైభోగమే’ వంటి విజయవంతమైన చిత్రాల పేర్లు గుర్తుకు వస్తాయి. అలాగే ఈ చిత్రాల పేర్లు గుర్తుకు వచ్చినా ఉత్తమ కధా చిత్రాల నిర్మాణ సంస్థ ‘శ్రీ రంజిత్ మూవీస్’ పేరు స్ఫురణకు వస్తుంది ఇటు చిత్ర పరిశ్రమలోనూ, అటు ప్రేక్షక వర్గాలలోనూ.
శ్రీ రంజిత్ మూవీస్ సంస్థ అధినేత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘నాని కథానాయుడిగా నందినిరెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ నిర్మించిన ‘అలా మొదలైంది’, సుమంత్ అశ్విన్ కథానాయకునిగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకునిగా నిర్మించిన ‘అంతకు ముందు...ఆ తరువాత’, మరోసారి నందిని రెడ్డి దర్శకురాలిగా నాగ సౌర్య కధా నాయకునిగా నిర్మించిన ‘కళ్యాణ వైభోగమే’ చిత్రాల విజయాల వెనుక వాటి వైవిధ్యమైన కధా బలంతో పాటు చిత్ర తారాగణం, సాంకేతిక నిపుణుల ప్రతిభ ఎంతో ఉంది. వీటితో పాటు ఆ చిత్రాల పబ్లిసిటీ, ప్రింట్ మరియు, ఎలక్ట్రానిక్ మీడియా వారి సహకారం ఎప్పటికీ మరిచిపోలేనిది ఈ సందర్భంగా వారికి మరోసారి కృతఙ్ఞతలు అన్నారు.
దాదాపు రెండు సంవత్సరాల విరామం తరువాత మళ్ళీ వరుసగా చిత్రాలను నిర్మించబోతున్నాను. ఇప్పటికే నాలుగు కథలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయటం జరిగింది. వీటి నిర్మాణం సమాంతరంగా జరుగుతుంది. వీటిలో ఒక చిత్రాన్ని జనవరి నెలలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నాము. నూతన దర్శకుడు సాగర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటీ,నటులతో పాటు, నూతన తారాగణం కూడా ఉంటారు. వీరు ఎవరన్నది కొద్దిరోజులలో ప్రకటిస్తాము. అలాగే తదుపరి చిత్రాల దర్శకులు, వాటికి సంబంధించిన తారాగణం వివరాలు కూడా ఒకదాని తరువాత మరొకటి తెలియజేయటం జరుగుతుంది. గత చిత్రాల కోవలోనే తమ తదుపరి చిత్రాల కథలు వైవిధ్యంగానే ఉంటాయని ప్రేక్షకులకు హామీ ఇస్తున్నాను..’’ అని తెలిపారు.