తమిళ దర్శకుడు, కొరియోగ్రాఫర్, బహుభాషా నటుడు రాఘవలారెన్స్ మొదటి నుంచి సమాజ సేవలో ముందుంటాడు. గతంలో ఈయన 151మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించాడు. ‘కాంచన’ చిత్రం తర్వాత హిజ్రాల కోసం తన ప్రతి చిత్రం పారితోషికం నుంచి కొంత పెద్ద మొత్తం కేటాయిస్తూ ఉన్నాడు. ఇక ఈయన ఎన్నోరకాల సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉంటాడు. జల్లికట్టు ఉద్యమం సందర్భంగా తన సొంత డబ్బుతో ఉద్యమంలో పాల్గొంటున్న యువతుల టాయిలెట్ సౌకర్యం కోసం కారవాన్‌లను పంపించాడు.
ఇక ఈయన తాజాగా గజ తుఫాన్ వల్ల నష్టపోయిన వారికి పెద్ద మనసుతో సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రాంతాలలో 50 ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. ఇలాంటి వారు తమ వివరాలను తనకి తెలపాలని కోరాడు. ఈ సందర్భంగా ఒక్కగానొక్క గుడిసె ఉన్న వృద్దురాలు అది కూలిపోవడంతో ఆమె రోధిస్తున్న వీడియోను ఆయన పోస్ట్ చేశాడు. తొలుత తాను ఈ అమ్మకి ఇల్లు కట్టించిన తర్వాతే మిగిలిన వారికి ఇళ్లు కట్టిస్తానని ప్రతిన బూనాడు. ఈ ఇళ్ల నిర్మాణ బాధ్యతలను కొంత మంది యువకులకు అందిస్తున్నట్లు ఆయన తెలిపాడు.
ఇక ‘గజ’ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు. విశాల్ ఓ గ్రామాన్ని దత్తత తీసుకోగా, రజనీకాంత్, కమల్‌హాసన్, విజయ్, విజయ్‌సేతుపతి తదితరులు తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. త్వరలో కెనడాలోని టొరెంటోలో షో నిర్వహించి ఆ మొత్తాన్ని గజ తుఫాన్ బాధితులకు అందజేస్తానని ఎ.ఆర్.రెహ్మాన్ పేర్కొన్నాడు.