యంగ్ హీరో నేచురల్‌స్టార్ నాని స్పీడు పెంచాడు. `కృష్ణార్జున యుద్ధం`, `దేవదాస్` చిత్రాలు ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో కొంత డైలమాలో పడ్డ నాని సినిమాల పరంగా మళ్లీ జోరు పెంచాడు. ప్రస్తుతం `మళ్లీ రావా` ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న `జెర్సీ` చిత్రంలో నటిస్తున్న ఆయన వరుసగా సినిమాలు అంగీకరిస్తూ స్పీడు పెంచేశాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించిన నాని `మనం` ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నలిచ్చాడు.
ఈ సినిమాకు సంబంధించిన విశేషాల్ని ఆదివారం ట్విట్టర్ ద్వారా నాని వెల్లడించాడు. దర్శకుడు విక్రమ్‌తో కలిసి ఓ గోడపై కూర్చున్న ఫోటోను అభిమానులతో పంచుకున్న నాని తను విక్రమ్‌తో కలిసి మైత్రీ మూవీమేకర్స్‌లో సినిమా చేస్తున్నట్టు కన్ఫర్మేషన్ ఇచ్చేశాడు. `నేను విక్రమ్ ఇంకా ఆ మిగతా ఐదుగురు వచ్చే ఏడాది మీ ముందుకు రాబోతున్నాం. అమ్మాయిలూ కవలం ఇది మీ కోసమే` అని ట్వీట్ చేశాడు. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.